ఆర్మూర్ ‘పసుపు’ ప్రత్యేకత ఏమిటో తెలుసా ?

ఒకప్రాంతంలో మంచి నాణ్యతతో పండే పంటకు విశిష్టత, అంతర్జాతీయ గుర్తింపు పొందటాన్నే జీఐ(GI) అంటారు.

Update: 2025-09-23 06:36 GMT
Armur Turmeric

ఒక్కసారిగా ఆర్మూరు పసుపుకు సంబంధించిన విషయం వైరల్ అయ్యింది. కారణం ఏమిటంటే పసుపుకు జీఐ గుర్తింపుకోసం కేంద్రప్రభుత్వానికి పరిశోధనా కేంద్రం దరఖాస్తు చేసుకోవటమే. ఆర్మూరు పసుపు(Armuru Turmeric) ఏమిటి ? జీఐ(జియోలాజికల్ ఇండెక్స్) గుర్తింపు ఏమిటనే విషయాన్ని తెలుసుకుందాము. ఒకప్రాంతంలో మంచి నాణ్యతతో పండే పంటకు విశిష్టత, అంతర్జాతీయ గుర్తింపు పొందటాన్నే జీఐ(GI) అంటారు. జీఐ గుర్తింపు వస్తువు లేదా ఉత్పత్తి రంగు, రుచి, పోషక విలువలు లాంటివాటి మీద ఆధారపడుంది. ఉమ్మడి నిజామాబాద్(Nizamabad) జిల్లాలోని ఆర్మూరులో పండే పసుపుకు పైన చెప్పిన విశేషణాలు అన్నీ ఉన్నాయి కాబట్టే కమ్మర్ పల్లిలోని ఆర్మూర్ పరిశోధా కేంద్రం పసుపు జీఐ గుర్తింపు రావాలని దరఖాస్తు చేసుకుంది.


దీనికి సంబంధించిన వివరాలను పరిశోధనా కేంద్రంలోని శాస్త్రవేత్త డాక్టర్ బొర్లకుంట మహేందర్ తెలంగాణ ఫెడరల్ తో పంచుకున్నారు. ఆయన ఏమిచెప్పారంటే ‘‘ఆర్మూరులో పండే పసుపు పంట మంచి నాణ్యతతో ఉంటుంద’’న్నారు. ‘‘తెలంగాణలో పసుపును జిగిత్యాల్, నిర్మల్, మహబూబాబాద్, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో కూడా పండిస్తున్న’’ట్లు చెప్పారు. అయితే ‘‘ఆర్మూరులో పండే పసుపు చాలా విశిష్టమైనద’’ని అన్నారు. ‘‘ఇక్కడ పండే పసుపుకు మంచి రంగు, రుచి, వాసన ఉంటుంద’’న్నారు. ‘‘ఈమధ్యనే ముగిసిన సీజన్లో ఆర్మూరు పసుపు క్వింటాలుకు అత్యధికంగా రు. 14 వేలు ధర పలికి’’నట్లు చెప్పారు. తొమ్మిదినెలల పంటయిన పసుపును ప్రతి ఏడాది జూన్- జనవరి మధ్య పండిస్తారని తెలిపారు.


‘‘తెలంగాణలోని 90 శాతం ఏరియాల్లో పండే పసుపును ‘ఎర్రగుంటూరు’ వెరైటీ అని అంటార’’ని చెప్పారు. దీన్నే దుగ్గిరాల రెడ్ అని కూడా అంటారని చెప్పారు. ‘‘వివిధ కారణాలతో పసుపుకు ధరలు పడిపోవటంతో ఒకపుడు 1.47 లక్షల ఎకరాల్లో పండిన పసుపు ఇపుడు కేవలం 47 వేల ఎకరాల్లో మాత్రమే పండిస్తున్న’’ట్లు ఆవేధనతో చెప్పారు. ‘‘నాణ్యమైన పసుపు పండటం అన్నది నేలస్వభావం, వాతావరణం మీద ఎక్కువగా ఆధారపడుంద’’న్నారు. ‘‘ఆర్మూరులో పసుపు మిగిలిన ఏరియాల్లో పండే పసుపుకన్నా తెగుళ్ళను తట్టుకునే స్వభావం ఎక్కువగా కలిగి ఉండటం అడ్వాంటేజ్’’ గా చెప్పారు. ‘‘లెమన్ ఎల్లో కలర్ లో పండే పసుపును అత్యంత నాణ్యతమైనదిగా రైతులు భావిస్తార’’న్నారు.


‘‘పుసుపులో కుర్కిమిన్ కంటెంట్ 2.5 నుండి 3 శాతం ఉంటుందన్నారు. బాగా హై క్వాలిటి పసుపులో కుర్కిమిన్ కంటెంట్ 6శాతం కూడా ఉంటుంద’’ని చెప్పారు. ‘‘తెలంగాణలో పండే పసుపును దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు బంగ్లాదేశ్, గల్ఫ్ దేశాలు, జపాన్, జర్మనీ, శ్రీలంక దేశాలకు ఎక్కువగా ఎగుమవుతుంద’’న్నారు. ‘‘పసుపును వంటల్లోనే కాకుండా ఫార్మాస్యూటికల్ కంపెనీలు, సౌందర్యసాధనాల తయారీలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్న’’ట్లు తెలిపారు. ‘‘పసుపు వాడకంవల్ల క్యాన్సర్ సోకే అవకాశాలు తక్కువగా ఉంటుంద’’ని ఇప్పటికే రుజువైన విషయాన్ని మహేందర్ గుర్తుచేశారు. రైతులు పసుపు కొమ్ములనే ఎక్కువగా అమ్మేస్తుంటారని చెప్పారు. పసుపు కొమ్ములను కొనే వ్యాపారులు దాన్ని పౌడర్ గా మార్చి దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు విదేశాలకు పంపుతున్నట్లు చెప్పారు.


‘‘ఆర్మైరు పసుపుకు జీఐ గుర్తింపు లభిస్తే ధర మరింత ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయ’’ని, మరిన్ని వేదేశాలు కొనుగోలుకు ఆసక్తిని చూపిస్తాయని చెప్పారు. ‘‘విదేశీ కంపెనీలు ఏ పంటను కొనాలన్నా దానికి జీఐ గుర్తింపు ఉందా అన్న విషయాన్ని చూస్తార’’ని అన్నారు. ‘‘జీఐ గుర్తింపును బట్టి ధరల్లో తేడా ఎక్కువగా ఉంటుంద’’ని కూడా డాక్టర్ మహేందర్ చెప్పారు. జీఐ గుర్తింపుకోసం హార్టికల్చర్ యూనివర్సిటిలోని పరిశోధకుడు, అసోసియేట్ ప్రొఫెసర్ పిడిగం సైదయ్య కృషిచేస్తున్నట్లు డాక్టర్ మహేందర్ చెప్పారు.

Tags:    

Similar News