నిజాం నవాబు భోజనంలో బాదం కీ జాలీ ఉండాల్సిందే
సంపన్నుల ఫంక్షన్లలో స్టేటస్ సింబల్ బాదం కీ జాలీ;
బాదం కి జాలి హైదరాబాద్‌కు చెందిన క్లాసిక్ స్వీట్ ఇది. ఒకప్పుడు నవాబులకే పరిమితమైన ఈ ఖరీదైన మిఠాయిని సంపన్నుల ఫంక్షన్లలో, ప్రత్యేక సందర్భాల్లో తినడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. అజీజ్‌బాగ్ ప్యాలెస్ పరిసరాల్లో తయారు చేసే బాదం కి జాలి అప్పట్లో ప్రతి రోజూ కింక్ కోఠి ప్యాలెస్‌కు వెళ్ళేది. హుస్సేని కుటుంబం నాలుగు తరాలుగా బాదం కి జాలిని తయారుచేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక మహిళా నేతృత్వంలో ప్రారంభమైన, జాలీలను తయారు చేసే కళ, ఒక తరం మహిళల నుండి మరొక తరానికి సంక్రమించింది. తన అత్తగారైన ఉనిస్సా నుంచి, నఫీస్ హుస్సేని ఈ మిఠాయి వంటను నేర్చుకుంది. ఆమె తన కోడలు - నస్రీన్ హుస్సేనికి నేర్పింది. తరువాత ఆమె మళ్ళీ ఆ వారసత్వాన్ని ఆమె కోడలు - ఐషా జహాన్‌కు అప్పగించింది.
బాదం, జీడిపప్పు, చక్కెరతో తయారు చేసే బాదం కి జాలి స్వీట్ రహస్యం ఆ కుటుంబం చేతిలోనే వుంది. ఒక తరం నుండి మరొక తరానికి అందిస్తూ గత 74 ఏళ్ళుగా హుస్సేని కుటుంబానికి చెందిన మహిళలే ఈ మిఠాయి తయారు చేస్తున్నారు. 88 ఏళ్ల నఫీస్ తన భర్త మద్దతుతో బాదం కి జాలి తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. అలా ఆమె తరువాత నఫీస్ కోడలు నస్రీన్ అత్తకు అండగా వుంటూ పాతబస్తీ నూర్ఖాన్ బజార్ అజీజ్‌బాగ్‌లో ఈ బాదం కి జాలిని ప్రత్యేకంగా తయారు చేసే వారు. కుటుంబ సమావేశాలు, పండుగలు, వివాహాల సమయంలో ఎవరైనా ఆర్డర్ ఇస్తే తయారు చేసి ఇచ్చేవారు. ఆరు సంవత్సరాల క్రితం నాల్గవ తరం ఎంట్రీ అయింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఐషా కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఐషా తన భర్త అలీ ఇద్దరూ దుబాయ్‌లోని వారి ఉద్యోగాలను విడిచిపెట్టి వచ్చినట్లు చెబుతోంది. రుచి, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా బాదం కి జాలి తయారు చేస్తున్నట్లు ఆమె చెబుతున్నారు.
అయితే బాదం కి జాలీ తయారుచేసే విధానాన్ని పెద్దగా చెప్పకుండా దాట వేసింది. “మేము బాదంపప్పులను వేడి నీటిలో నానబెట్టి ఆరబెట్టుకుంటాము. జీడిపప్పు, బాదంపప్పులను పిండిలో రుబ్బి, ఆపై చక్కెరతో పిండిలా తయారు చేస్తారు. ఆ అచ్చుకు వివిధ ఆకారాలు ఇచ్చి బేకింగ్ కోసం ఉంచుతారు. మొత్తం ప్రక్రియ దాదాపు 4-5 గంటలు పడుతుంది. ఈ మిఠాయి చూడడానికి కుకీల వలె ఉంది. రుచి కాజు కట్లిని పోలి ఉంది.” బాదం, షేప్ చేయడానికి ఉపయోగించే జాలి కారణంగా బాదం కి జాలి అనే పేరు పెట్టారట. పూల నమూనాలుగా కత్తిరించి, సన్నని తినదగిన వెండి షీట్ అయిన వరక్‌తో అలంకరిస్తున్నారు.