"ప్రజాసంగ్రామ యాత్రలో పేదల కన్నీళ్లను చూశాను, విద్యార్థుల మొట్ట మొదటి ఆస్తి సైకిల్. ఆ తొలి ఆస్తిని నేను మీకు అందజేస్తున్నా. సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోండి అంబేద్కర్, మోదీ స్పూర్తిగా రాణించండి."
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా వేల సైకిళ్లను ఎందుకు అందించారో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ రోజు వెల్లడించారు. దీనిని తాను జరిపిన 'ప్రజాసంగ్రామ యాత్ర' కారణమని చెప్పారు. ఆయన బిజెపి అధ్యక్షుడి గా ఉన్నపుడు 2021 ఆగస్టు నెలలో ఈ యాత్ర హైదరాబాద్ చార్ మినార్ ని ఆనుకుని ఉన్న భాగ్య లక్ష్మి ఆలయం నుంచి ప్రారంభమయింది.
"ప్రజా సంగ్రామ యాత్రలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎంతో మంది పిల్లలు ఎండలో నడుస్తూ ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్న బాధాకరమైన దృ శ్యాలను కళ్లారా చూశాను. ఇది నన్ను కలచివేసింది. దీనిని దృష్టిలో ఉంచుకునే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాను," ఆయన వెల్లడించారు. నిజానికి ఒక ప్రభుత్వం చేయాల్సినంత పెద్ద పని ఆయన చేయడం చాలా గొప్ప విషయం.
ఎందుకు సైకిల్?
"విద్యార్థుల మొట్ట మొదటి ఇష్టమై ఆస్తి సైకిల్. ఆ ఆస్తిని నేను మీకు అందజేస్తున్నా. ఇది ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీ ఇస్తున్న గిఫ్ట్. సక్రమంగా వినియోగించుకోండి. ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం గొప్ప కార్యాన్ని చేయాలని ప్రధాని మోదీ పదేపదే స్పూర్తిదాయకమైన సందేశం ఇస్తుంటారు. అందులో భాగంగానే ఈరోజు ‘మోదీ గిఫ్ట్’ పేరుతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్లలో సైకిళ్లను పంపిణీ చేశాం. ఈరోజు హుజూరాబాద్ లో పంపిణీ చేస్తున్నం. ఈ మూడు ప్రాంతాల్లో ప్రతి ఒక్క విద్యార్ధికి సైకిల్ అందిన తరువాతే ఇతర నియోజకవర్గాల్లో పంపిణీ చేస్తాం. దాదాదాపు 20 వేలకుపైగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నాం. ఇది నా సొంత ఆస్తి కాదు. ప్రభుత్వ నిధులు కాదు. కొన్ని సంస్థలు, దయార్థ్ర హ్రుదయులు ఇచ్చిన సీఎస్సార్ ఫండ్ తో ఈ సైకిళ్లను కొనుగోలు చేసి పేద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నా," అని హుజూరాబాద్ ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్ లో ప్రభుత్వ పాఠశాలల్లో చెప్పారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతున్నంతసేపు సైకిళ్లు అందుకున్న బాలబాలికల ఆనందానికి అవధుల్లేవు. విజిల్స్, చప్పట్లు కొడుతూ నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
"నేను పేదరికం నుండి వచ్చిన. నాకు చిన్నప్పుడు సైకిల్ తొక్కాలనే కోరిక ఉండేది కాదు. కొనే స్థోమత లేకుండే. మా నాన్న పదేపదే అడిగితే 15 పైసలు ఇచ్చేవారు. ఆ పైసలతో గంట సేపు కిరాయికి సైకిల్ తీసుకుని తొక్కేవాడిని. నేను ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సమయంలో 1650 కి.మీల దూరం పాదయాత్ర చేసిన. పాలమూరులో యాత్ర చేస్తున్న సమయంలో ఓ ఊరికి వెళ్లి కూలీలను కలిసిన. ఆ పక్కనే ఉన్న గుడిసెను చూపి ఇది కూలిపోయే గుడిసె. ఆ ఇంట్లో ముసలమ్మ, ఓ మానసిక వికలాంగుడైన బాలుడు ఉన్నాడు. స్కూల్ కు వెళ్లడం లేదని అతనిని పిచ్చోడిగా ముద్ర వేశారు. కానీ ఆ బాబును చూస్తే చాలా యాక్టివ్ గా కన్పించిండు. అతనిని పిలిచి నువ్వు స్కూల్ కు పోవాలంటే ఏం చేయాలి? నీ ఫ్రెండ్స్ ఎవరు? అని అడిగిన. అప్పుడు సార్... నా ఫ్రెండ్స్ అందరి దగ్గర సైకిళ్లున్నాయి. నేను సైకిల్ తొక్కాలని వెళితే దగ్గరకు రానీయడం లేదు. అందుకే నాకు స్కూల్ కు వెళ్లాలన్పించడం లేదు. అని అంటే సైకిల్ ఇప్పిస్తే స్కూల్ కు వెళతావా? అని అడిగితే ఎగిరి గంతేసి వెళతానని చెప్పారు. నేను వెంటనే సైకిల్ షాపుకు తీసుకుని సైకిల్ ఇప్పించా. అప్పటి నుండి ఆ అబ్బాయి రెగ్యులర్ గా స్కూల్ కు వెళుతున్నాడు. నా పాదయాత్రలో వేలాది మంది పిల్లలకు చెప్పులు కూడా లేకుండా ఎండలో తిరిగిన ద్రుశ్యాలు కన్పించినయ్. కొన్ని వేల మందికి చెప్పులు కొనించిన. ఇయాళ నేను ఎంపీగా గెలిచానంటే 50 శాతం పిల్లలే కారణం. వాళ్లే నాకు ఓట్లేయించి గెలిపించారు," అని బండి సంజయ్ అన్నారు.
"ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు స్కూల్ కు వెళ్లాలంటే ఇంటి నుండి చాలా దూరం నడిచి వెళ్తున్నారు. ఆటోలు, బస్సుల్లో వెళదామంటే పైసలుండవు. సొంతంగా బండి కొనే స్థోమత ఉండదు. ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలకు స్పెషల్ క్లాస్ లు ఉంటాయి. దీంతో చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ద్రుష్టిలో ఉంచుకుని ఈ సైకిళ్ల పంపిణీని చేపట్టినం. ఈ సైకిళ్ల పంపిణీ సక్సెస్ ఫుల్ గా జరుగుతోంది. దేశవ్యాప్తంగా సానుకూల చర్చ జరుగుతోంది,"అని ఆయన చెప్పారు.
త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్ కేజీ నుండి 6వ తరగతి వరకు ‘మోదీ కిట్స్’ ను పంపిణీ చేస్తామని కూడా ఆయన ప్రకటించారను. ఒక స్కూల్ బ్యాగ్ తోపాటు వాటర్ బాటిల్, పెన్ను, పెన్సిళ్లు, నోట్ పుస్తకాలు, రబ్బర్ ను ‘మోదీ కిట్స్’ పేరుతో అందిస్తా. తప్పనిసరిగా వినియోగించుకుని బాగా చదువుకుని రాణించాలని విద్యార్థులను కోరుతున్నానని అన్నారు.