"ఇది మూసీ పేరుతో లూటీ..."
మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్‌పై కేంద్ర సహాయక మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్‌పై కేంద్ర సహాయక మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీది బ్యూటీ ప్రాజెక్ట్ కాదని, లూటీ ప్రాజెక్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరలేపిందంటూ కీలక విమర్శలు గుప్పించారు. తమ స్వార్థం కోసం పేదల ఇళ్లను సైతం కూల్చేస్తోందని, తమ జేబులు నింపుకోవడం కోసం పేదలను రోడ్డున పడేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న కాంగ్రెస్ తీరును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు బండి సంజయ్. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల ఖర్చు చేసి.. కాళేశ్వరంను సొంత ఏటీఎంలా వినియోగించుకుందని, ఇప్పుడు మూసీ పేరుతో కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోందని విమర్వలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, గత పాలకులు చేసిన రూ.6లక్షల కోట్లకుపైగా అప్పులకు 10 నెలల్లోనే రూ.60వేల కోట్ల వడ్డీలు చెల్లిస్తున్నారని అన్నారు బండి సంజయ్.
రాష్ట్ర ఖజానా డొల్లగా ఉందని ఒకవైపు చెప్తూనే మూసీ ప్రాజెక్ట్ కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం రేవంత్ ఎలా చెప్తారని ప్రశ్నించారు బండి సంజయ్. పేదల, రైతుల కష్టాలు తీర్చాలంటే రాని డబ్బులు మూసీ ప్రాజెక్ట్‌కు ఎలా వస్తున్నాయని నిలదీశారు. మూసీ పేరుతో అవినీతి చేయడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని, వాటిని విమర్శిస్తున్నందుకే తమ పారటీ నేతలను టార్గెట్ చేస్తోందని కూడా విమర్శించారు. నిజంగా మూసీ ప్రక్షాళన, సుందరీకరణ అభివృద్ధిలో భాగమనుకుంటే నిర్వాసితులకు సరైన వసతులతో పునరావాసం కల్పించాలని, వారు ఉండటానికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు.
‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ఒకటో తేదీ వస్తుందంటే ప్రభుత్వం భయపడేలా ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం గగనంగా మారింది. సంక్షేమ పథకాలను అమలు చేయలేక, ఎన్నికల హామీలను అమలు చేయడం చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం సతమతమవుతోంది. మూసీ ప్రక్షాళన అంటూ దశాబ్దాలుగా జపాన్, జైకా నిధులు కూడా ఖర్చు చేసిన ఒరిగిందేముంది. పాలకులు చేస్తున్న అప్పుల భారమంతా పన్నుల రూపంలో ప్రజలపై పడటం తప్ప. తెలంగాణలోని ప్రతి కుటుంబం అప్పుల్లో ఉందని, ఒక్కో కుటుంబంపై సగటుల రూ.1,29,599 అప్పు ఉంది’’ అని వివరించారు. ఇప్పుడు మూసీ పేరుతో మరో లక్షన్నర కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ భారాన్ని కూడా ప్రజలపై మోపడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పారు. తమ పార్టీ బీజేపీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా కాదని, దాని పేరిట చేస్తున్న దోపిడీకి మాత్రమే తాము వ్యతిరేకసమని స్పష్టం చేశారు.