బ్రహ్మాండంగా బతుకమ్మ పండగ
గిన్నీస్ బుక్‌లోకి ఎక్కేలా ప్లాన్ చేస్తున్నామన్న మంత్రి జూపల్లి.;
బతుకమ్మ పండగను కనివినీ ఎరుగని విధంగా నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గిన్నీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కేలా ఈ ఏడాది బతుకమ్మను నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారాయన. ఈ పండగను ఓ మహోత్సవంగా నిర్వహిస్తామని, ప్రపంచమంతా తెలంగాణవైపు అబ్బురపోయి చూడటం తథ్యమని అన్నారు. సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని, ఇందుకోసం కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను మంత్రి కొండా సురేఖ, సీతక్కతో కలిసి ఆయన వెల్లడించారు.
వేయిస్తంభాల గుడిలో ప్రారంభం
‘‘ఈ నెల 21న వేయిస్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ నెల 29న ఎల్‌బీ స్టేడియంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. పీపుల్స్ ప్లాజాలో మహిళా స్వయం సహాయక సంఘాలతో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో విద్యార్థులంతా పాల్గొనేలా వేడుకలుంటాయి. బతుకమ్మకు జాతీయస్థాయి ప్రచారం కోసం కొన్ని విమానయాన సంస్థలతో ఒప్పందం కూడా చేసుకున్నాం’’ అని జూపల్లి చెప్పారు.
పర్యాటక రంగానికి ప్రచారం..
‘‘బతుకమ్మ వేడుకల ద్వారా తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రచారం చేస్తాం. ఈ పండగ గురించి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి దేవిదేశాలకు తెలిసేలా చేస్తాం. పర్యాటక శాఖ, మహిళలను ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేస్తాం. తెలంగాణ పర్యాటక రంగానికి బతుకమ్మ వేడుక అతిపెద్ద వేదికగా మారుతుంది. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తాం’’ అని మంత్రి కొండా సురేఖ తెలిపారు.