బీసీ రిజర్వేషన్ల సంక్షోభం.. తెలంగాణ ప్రభుత్వం ఏమి చేస్తుంది?

బంద్ అనంతర పరిణామాలు, న్యాయపరమైన సవాళ్లు ఎలా ఎదుర్కొంటుంది? 24న బీసీ మహాధర్నా

Update: 2025-10-20 10:32 GMT

ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డైడ్... ఈ చందంగానే వుంది తెలంగాణ బీసీ రిజర్వేషన్ల వ్యవహారం. అసెంబ్లీ లో అన్ని పార్టీలు బిల్లుకు మద్దతిస్తాయి. పోటీపడి అన్ని పక్షాలు బంద్ కు మద్దతిచ్చాయి. ఇంత జరుగుతున్నా ఫలితం మాత్రం అగమ్యగోచరంగా వుంది.

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఉత్పన్నమైన బీసీ రిజర్వేషన్ల సంక్షోభం ప్రస్తుతం పరిపాలనా, న్యాయపరమైన తీవ్రమైన రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించినప్పటికీ, సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేయడం ద్వారా ఆ ప్రయత్నానికి న్యాయపరమైన అడ్డంకి ఏర్పడింది. ఫలితంగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, రిజర్వేషన్లను 50 శాతం పరిమితికి లోబడి ఉంచుతూ, పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లాల్సిన అత్యవసరం ఏర్పడింది.
కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన వెంటనే బీసీ సంఘాలు బంద్ అంటూ ఉద్యమించి సక్సెస్ అనిపించాయి. ఎవరూ వద్దనేవారు లేరు.. కానీ పద్దతి ప్రకారం ముందుకు వెళ్లి సాధించటం లేదన్నది మరో వాదన.తమ ఉద్యమంలో భాగంగా 24 తేదీ హైదరాబాద్ లో మహాధర్నా కు బీసీ సంఘాలు సిద్దమయ్యాయి.
అక్టోబర్ 18న నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతమైందని, ఇది బీసీల ఐక్యతను , 42 శాతం రిజర్వేషన్ల ఆకాంక్షను చాటిచెప్పిందని బీసీజేఏసీ ప్రకటించింది. జేఏసీ ఛైర్మన్ ఆర్. కృష్ణయ్య ఈ పోరాటాన్ని చట్టబద్ధత కల్పించే వరకు, చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం ఉకల్పించేవరకు కొనసాగిస్తామని, అవసరమైతే 'తెలంగాణ ఉద్యమం కంటే ఉధృతంగా' పోరాటం చేస్తామని వెల్లడించారు.
తప్పవరిది? అడ్డకుంటున్నదెవరు?
తెలంగాణ బంద్ అనంతర పరిణామాలు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. ఒకవైపు తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది , మరోవైపు తమ కీలక ఓటు బ్యాంకు అయిన బీసీలను సంతృప్తి పరచడానికి 42 శాతం రిజర్వేషన్ల వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన రాజకీయ అవసరం ఉంది. ఈ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది.
ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఒబీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు , తండు శ్రీనివాస్ యాదవ్ ఫెడరల్ తెలంగాణ తో మాట్లాడుతూ తాము ఇచ్చిన హామీకి కట్టుబడే నిర్ణయం వుంటుందన్నారు." పార్లమెంట్ సెషన్స్ దాకా ఆగి అక్కడ కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి పెంచి , బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం" అన్నారు.
"ఈ లోగా స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. పార్టీ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం.మొన్న ఎంపిక చేసిన అభ్యర్దులే నామినేషన్లు వేస్తారు" అంటూ తండు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఒకవైపు పరిపాలనా స్తబ్దతను తొలగించడానికి తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది , మరోవైపు తమ కీలక ఓటు బ్యాంకు అయిన బీసీలను సంతృప్తి పరచాలి. ఈ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి, ప్రభుత్వం తక్షణమే అత్యవసర ఎన్నికల నిర్వహణ, ట్రిపుల్ టెస్ట్ ప్రక్రియను వేగవంతం చేయడం ,దానితో పాటు 42 శాతం బీసీ రి‌జర్వేషన్ , 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు జాతీయ రాజకీయ బేరసారాలు వంటి వ్యూహాత్మక మార్గాలను ఏకకాలంలో అనుసరించాల్సిన స్థితి ఏర్పడింది.
స్థానిక ఎన్నికల తక్షణ నిర్వహణ అవసరం ఎంత?
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం కేవలం రాజ్యాంగ విధి మాత్రమే కాకుండా, కీలకమైన పరిపాలనా అనివార్యతగా మారింది. సుమారు ఒకటిన్నర సంవత్సరాలుగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు , మున్సిపాలిటీలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేకుండా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ కారణంగా పరిపాలనా శూన్యత, స్థానిక ప్రభుత్వాలలో నాయకత్వం,ఆర్థిక వనరులు రెండూ కొరవడ్డాయి. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు కూడా నిలిచిపోయాయి. దీంతో గ్రామాలలో, పట్టణ స్థానిక సంస్థలలో పరిపాలన స్తంభించింది. ఈ పరిపాలనా సంక్షోభం, న్యాయపరమైన ఆలస్యం కంటే తక్షణమే పరిష్కరించాల్సిన పెద్ద సమస్యగా రాష్ట్ర ప్రభుత్వానికి మారింది. దీనిని పరిష్కరించకుండా, ట్రిపుల్ టెస్ట్ వంటి న్యాయపరమైన ప్రక్రియల కోసం ఎక్కువ కాలం వేచి ఉండటం వల్ల పాలనా వ్యవస్థ మరింత దిగజారుతుంది. ఈ కారణంగా, ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలను నిర్వహించడానికి మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ అంశంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నన్స్ సభ్యులు ప్రొఫెసర్ మోహన్ రావు ఫెడరల్ తెలంగాణ తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం పెరిగిందన్నారు. " ఒక వైపు కోర్టు గడువు మరోవైపు కేంద్రం నుంచి నిధులు ఆగిపోవడం, ప్రభుత్వం పై వత్తిడి పెంచుతున్నాయి" అన్నారు.
"రాష్ట్ర ప్రభుత్వం అసలే అప్పుల భారం మోస్తోంది. స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు ఆగితే, ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.. అందుకే ఎన్నికలు నిర్వహించాలి" అని తెలిపారు.
రాజ్యాంగ సవరణ జరిగితేనే సాధ్యం
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ప్రొఫెసర్ మోహన్ రావు అభిప్రాయపడ్డారు. "రాజ్యాంగ పరంగా జరగాల్సిన రిజర్వేషన్ల తుట్టెను కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్దికోసమే కదిపింది. అదేరీతిలో మిగిలిన పార్టీలు స్పందిస్తున్నాయి.రిజర్వేషన్లు వస్తాయో రావో అట్లుంచితే అన్ని పార్టీలు బీసీలను రెచ్చగొట్టి వదిలేశాయి" అన్నారు. "రిజర్వేషన్లు ఇప్పట్లో తేలే అంశం కాదు, అందరూ అభిప్రాయ పడుతున్నట్లు 9వ షెడ్యుల్ లో చేర్చినా, సుప్రీంకోర్టు మళ్లీ సమీక్షించే అవకాశం వుంది. అవసరమైతే సమీక్ష తప్పదని తెలిపింది. కాబట్టి రాజ్యాంగ సవరణ తోనే 42శాతం బీసీ రిజర్వేషన్లకు అడుగు పడాలి. అన్ని పార్టీలు చిత్తశుద్ధితో పూనుకోవాలి" అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇందిరా సాహ్ని కేసులో నిర్దేశించిన 50 శాతం పరిమితి ప్రాముఖ్యతను స్థానిక సంస్థల ఎన్నికల రంగంలో కూడా పునరుద్ఘాటించింది. ఆర్టికల్ 243కి సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులకు కట్టుబడి ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో కులగణన చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ, కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రిజర్వేషన్లు 50 శాతానికి మించి వెళ్లడానికి అనుమతించదని కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానపు అభిప్రాయం ప్రకారం, ఒకవేళ మినహాయింపులు ఉంటే, అవి గిరిజనులు, గిరిజన ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయని, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఈ మినహాయింపు ఉండదని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే, రాజ్యాంగపరంగా, న్యాయపరంగా తప్పనిసరిగా కె. కృష్ణమూర్తి (2010) , వికాస్ కిషన్‌రావు గవాలి (2021) కేసుల ద్వారా నిర్దేశించబడిన 'ట్రిపుల్ టెస్ట్' ను పాటించాలి.వెనుకబాటుతనం గుర్తింపు జరగాలి, వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో ఎంత మేరకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందో నిరూపించడానికి ఈ డేటాను ఉపయోగించాలి,మొత్తం రిజర్వేషన్ల శాతం (SC/ST/BC కలిపి) ఏ పరిస్థితిలోనూ 50 శాతం పరిమితిని మించకుండా చూసుకోవాలి. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో కూడా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ట్రిపుల్ టెస్ట్‌ను సరిగ్గా పాటించనందుకు హైకోర్టులు ఆ నిర్ణయాలను కొట్టివేశాయి. ఈ రాష్ట్రాల్లో, ట్రిపుల్ టెస్ట్ పూర్తయ్యే వరకు బీసీ రిజర్వేషన్లను జనరల్ కేటగిరీగా పరిగణించి ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానాలు ఆదేశించాయి. తెలంగాణ ప్రభుత్వం పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లకపోతే, న్యాయస్థానం జోక్యం చేసుకొని, బీసీ రిజర్వేషన్లను జనరల్ కేటగిరీగా పరిగణించి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించే ప్రమాదం ఉంది.
కేంద్రం చేతిలోనే..
తమిళనాడులో ప్రస్తుతం 69% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. 50% పరిమితిని దాటకూడదనే సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ, ఈ 69% రిజర్వేషన్లకు 1994లో 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌లో చేర్చి, రాజ్యాంగ రక్షణ కల్పించారు.
తమిళనాడులో ఈ రాజ్యాంగ సవరణ సాధించడం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత, కేంద్రంలో అధికారంలో ఉన్న పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై గట్టి రాజకీయ ఒత్తిడి , బేరసారాల ఫలితంగా జరిగింది.
తెలంగాణ విషయంలో 9వ షెడ్యూల్‌లో చేర్చడం అనేది అత్యంత కష్టతరమైన ప్రక్రియ. దీనికి పార్లమెంటులో రెండవ వంతు మెజారిటీతో రాజ్యాంగ సవరణ అవసరం. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ, పూర్తిగా సహకరించాలి. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలో వుంది కాబట్టి, ఆ ఫలితం కాంగ్రెస్ కు ప్లస్ అవుతుంది. మరి రాజకీయంగా బీజేపీ ఎందుకు ముందుకొస్తుందని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.అయితే ఇప్పుడు తెలంగాణ లో మొదలైన బీసీ ఉద్యమం జాతీయ స్థాయి ఉద్యమంగా మారే అవకాశం వుందేమో చూడాలి.
Tags:    

Similar News