తెలంగాణాలో బీర్ల యుద్ధం

గతంలో ఎప్పుడూ లేనట్లుగా తెలంగాణాలో బీర్ల యుద్ధం జరుగుతోంది. తెలంగాణాలో ఇప్పటికే బీర్ల ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు, కొత్త కంపెనీలకు మధ్య యుద్ధం నడుస్తోంది.

Update: 2024-06-12 11:02 GMT

గతంలో ఎప్పుడూ లేనట్లుగా తెలంగాణాలో బీర్ల యుద్ధం జరుగుతోంది. తెలంగాణాలో ఇప్పటికే బీర్ల ఉత్పత్తి కంపెనీలు(బ్రూవరీలు) బీర్ల తయారు చేయటానికి సిద్ధపడిన కొత్త కంపెనీలకు మధ్య యుద్ధం నడుస్తోంది. అయితే కంపెనీలు తమ మధ్య వివాదాలను తేల్చుకోకుండా మధ్యలో మీడియాను కూడా లాగాయి. ఎలాగంటే బీర్ల తయారీకి కొత్తగా రెడీ అయిన కంపెనీలపై పాత కంపెనీలు నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దాంతో కొత్త కంపెనీలు కూడా పాతకంపెనీలపై ఇదే విధమైన యుద్ధానికి తెరలేపాయి. ఈ మొత్తంలో ఏమిచేయాలో అర్ధంకాక ప్రభుత్వం తలపట్టుకుంది.

ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణాలో 6 బ్రూవరీలు బీర్లు తయారుచేస్తున్నాయి. అన్నీ కంపెనీలు కలిపి నెలకు సుమారు 70 లక్షల కేసులు ఉత్పత్తిచేస్తున్నాయి. వీటిలో యూబీ కంపెనీ తయారుచేస్తున్న కింగ్ ఫిషన్ బీర్లలో కింగ్ ఫిషర్ లైట్ అనే బ్రాండ్ చాలా పాపులర్. 6 బ్రూవరీలు కలిపి 70 రకాల బ్రాండ్లతో బీర్లను తయారుచేస్తున్నాయి. వీటన్నింటిలో కింగ్ ఫిషర్ లైట్ బ్రాండ్ వాటా సుమారు 20 శాతం. ఇందులో ఆల్కహాలు శాతం తక్కువగా ఉండటమే కాకుండా రుచికరంగా ఉండటం వల్ల చాలామందిలో ముఖ్యంగా యువత కింగ్ ఫిషర్ లైట్ ను ఎక్కువగా ఇష్టపడుతారు. ఇపుడు విషయం ఏమిటంటే కొంతకాలంగా కింగ్ ఫిషర్ లైట్ బీర్ కు మార్కెట్లో కొరతవచ్చేసింది. కారణం ఏమిటంటే కంపెనీ ఈ బీరు ఉత్పత్తిని బాగా తగ్గించేసింది. ఎందుకంటే ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు పేరుకుపోతుండటంతో యాజమాన్యం నిరసనగా కింగ్ ఫిషర్ బీర్ ఉత్పత్తిని బాగా తగ్గించేసింది. లిక్కర్ అంటే బ్రాందీ, విస్కీ, వోడ్కా, జిన్ లాంటి రకాలతో పాటు బీర్లు, వైన్ తయారుచేస్తున్న కంపెనీలకు ప్రభుత్వం సుమారు రు. 2 వేల కోట్ల బకాయి పడింది.

2023 ఎన్నికలకు ముందే ఈ బకాయిలు పేరుకుపోయాయి. బకాయిలు ఎందుకు పేరుకుపోయాయంటే అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం డిస్టల్లరీలు, బ్రూవరీలకు ప్రతి 45 రోజులకు చెల్లించాల్సిన డబ్బులను చెల్లించలేదు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా చూపించి డబ్బులు చెల్లించలేదు. ఎన్నికల కోడ్ సుమార 2 నెలలకు పైగా సాగింది. దాంతో బకాయిలు పెరిగిపోయాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పెట్టిన బకాయిలను తామెందుకు చెల్లించాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బకాయిలను అలాగే ఉంచేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపెనీలు చేసిన సరఫరాకు మాత్రం ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తోంది. అయితే బకాయిలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఇంతలో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో చెల్లింపులకు మళ్ళీ కోడ్ అడ్డొచ్చింది. పార్లమెంటు ఎన్నికల కోడ్ కూడా సుమారు 2 నెలలు కంటిన్యు అవటంతో ఇప్పుడు కూడా బకాయిలు పేరుకుపోయి. మొత్తం సుమారు రు. 2 వేల కోట్లకు చేరుకుంది.

ఈ మొత్తం బకాయిల్లో మేజర్ షేర్ బీర్ల సరఫరాకు సంబంధించిన బకాయిలే ఉన్నాయి. బకాయిలను రాబట్టుకునేందుకు బ్రూవరీలు బీర్ల ఉత్పత్తిని తగ్గించేశాయి. బండలు కూడా పగిలిపోయే ఎండాకాలంలో మద్యం ప్రియుల్లో ఎక్కువమంది బీర్లు తాగటానికే మొగ్గుచూపుతారు. అలాంటిది మార్కెట్లు బీర్ల(కింగ్ ఫిషర్ లైట్)కొరత ఎక్కువైపోవటంతో పరోక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడిపెరిగిపోయింది. అందుకనే కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో బీర్లను ఉత్పత్తిచేస్తు తెలంగాణాలో సరఫరా చేసే పద్దతిలో దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం ఆరు కంపెనీలు దరఖాస్తులు చేసుకుంటే 5 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందంచేసుకుంది. అయితే ఏ కంపెనీకి పర్చేజింగ్ ఆర్డర్ మాత్రం ఇవ్వలేదు. ప్రభుత్వం ఒప్పందంచేసుకున్న కంపెనీలో మధ్యప్రదేశ్ కు చెందిన సోమ్ బ్రూవరీ కూడా ఒకటి. ఈ బ్రూవరీ కంపెనీ మీదే తెలంగాణాలో బాగా నెగిటివ్ గా ప్రచారం జరిగింది. దాంతో ఆ కంపెనీ కూడా అదే పద్దతిలో లోకల్ కంపెనీలపైన ఎదురుదాడికి దిగింది. దాంతో మొత్తం వ్యవహారమంతా కంపైపోవటంతో ప్రభుత్వం అన్నీ కంపెనీలను హోల్డులో పెట్టింది. అంటే ఏ కంపెనీ నుండి కూడా బీర్లను ఇప్పటివరకు కొనలేదు.

లోకల్ బ్రూవరీలు బీర్ల ఉత్పత్తిని పెంచకపోగా బయటనుండి సరఫరా చేస్తామని వచ్చిన కంపెనీలపై చెడు ప్రచారం మొదలుపెట్టాయనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఎండాకాలంలో బీర్లకుండే డిమాండ్ అంతా ఇంతాకాదు. అలాంటి వేసవి సీజన్లో డిమాండుకు తగ్గట్లుగా బీర్ల ఉత్పత్తి జరగలేదన్నది వాస్తవం. సీజన్ మారిపోతే బీర్ల డిమాండు కూడా తగ్గిపోతుంది. అయితే ఇపుడు సీజన్ మారుతున్నా ఎండలు ఎక్కువగానే ఉంటున్నాయి కాబట్టే బీర్లకు డిమాండ్ తగ్గలేదు. బకాయిలు చెల్లిస్తే కాని బీర్ల ఉత్పత్తిని అవసరానికి తగ్గట్లుగా చేయమని కంపెనీలు గట్టిగా పట్టుబట్టాయి. డిమాండును తట్టుకోవటానికి బయట కంపెనీలతో ఉత్పత్తి చేయించి తెలంగాణాలో సరఫరాకు అనుమతివ్వాలన్న ప్రభుత్వ ప్రయత్నం ఆగిపోయింది. ఈ వివాదంలో డీలర్లు, రీటైలర్లు. జనాలు ఇబ్బందిపడిపోతున్నారు.

ఇదే విషయమై తెలంగాణా ఫెడరల్ తో వైన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దళపతి వెంకటేశ్వరరావు మాట్లాడుతు ‘వేసవికాలంలో జనాలకు బీర్ల తగినంత దొరకలేదన్నది వాస్తవమ’న్నారు. ‘రోజుకు 1.2 లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి అవ్వాల్సింది ఇపుడు 60 వేల కేసులు మాత్రమే అవుతు’న్నట్లు చెప్పారు. ‘ప్రభుత్వం నుండి బ్రూవరీలకు సుమారు రు. 2 వేల కోట్ల బకాయిలు రావాల్సుంద’న్నారు. ‘బకాయిలను రాబట్టుకోవటంలో భాగంగానే బ్రూవరీలు బీర్ల ఉత్పత్తిని తగ్గించేయటంతో మార్కెట్లో బీర్ల కొరత వచ్చేసింద’న్నారు. ‘ఎన్నికల కోడ్ తో పాటు రకరకాల కారణాలతో బకాయిలు పేరుకుపోయింద’ని చెప్పారు. నెగిటివ్ ప్రచారం జరిగిన సోమా కంపెనీకి మంచి ట్రాక్ రికార్డుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ కంపెనీ లిక్కర్, బీర్ ను తెలంగాణాలో సరఫరా చేసిన విషయాన్ని దళపతి గుర్తుచేశారు.

ఇదే విషయమై బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ అబ్రహం మాట్లాడుతూ... ‘బీర్ల తయారీకంపెనీ యూబీకి ప్రభుత్వానికి మధ్య వివాదం వచ్చింద’న్నారు. ‘బీర్లు, లిక్కర్ తయారుచేస్తున్న కంపెనీలకు ప్రభుత్వం నుండి రు. 1500 కోట్ల బకాయిలు ఉంద’ని చెప్పారు. ‘నెలకు 50 లక్షల కేసుల బీర్లు తయారవుతుంటే యూబీ కంపెనీ తయారుచేస్తున్న కింగ్ ఫిషర్ లైట్ బ్రాండ్ వాటా 20 శాతం ఉంటుంద’న్నారు. ‘బయటరాష్ట్రాల్లో బీర్ ను ఉత్పత్తిచేసి తెలంగాణాలో సరఫరా చేసేట్లుగా ఐదు కంపెనీలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని హోల్డులో పెట్టింద’న్నారు. ‘లోకల్ కంపెనీలకు బయట కంపెనీలకు మధ్య వివాదం, నెగిటివ్ ప్రచారం గురించి అడిగినపుడు ఆ విషయం తమకు తెలియద’ని చెప్పారు. బయట కంపెనీలతో ప్రభుత్వం బీర్ల సరఫరాకు ఒప్పందంచేసుకోగానే యూబీ కంపెనీ బీర్ సరఫరా విషయంలో ప్రభుత్వంతో చర్చలు మొదలుపెట్టిందన్నారు. బకాయిలు చెల్లించే విషయాన్ని ప్రభుత్వమే చెప్పాలన్నారు. వివాదం తొందరలోనే ముగిసిపోతుందన్న ఆశాభావాన్ని అబ్రహం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News