యాదాద్రి వివాదంపై భట్టి క్లారిటీ.. ‘అందరికీ కృతజ్ఞతలు’

భట్టి విక్రమార్కను సీఎం రేవంత్ అవమానించారన్న వివాదంపై ఉప ముఖ్యమంత్రి స్పందించారు. తానే అక్కడ కూర్చున్నానని స్పష్టత ఇచ్చారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Update: 2024-03-12 17:05 GMT
భట్టి విక్రమార్క


యదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సహా మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క చేసిన పర్యటన తీవ్ర వివాదానికి తెరలేపింది. ఈ పర్యటనలో భాగంగా వారు యాదాద్రీశుని ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటిలో అందరూ పెద్ద పీటలపైన కూర్చోగా భట్టి విక్రమార్కకు మాత్రం చిన్న పీట వేశారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేవలం దళితుడు అన్న కారణంగానే భట్టి విక్రమార్కను అవమానిస్తూ చిన్న పీట వేశారని, రెడ్డి సామాజిక వర్గం వారంతా పెద్ద పీటలపైన కూర్చున్నారని నెట్టింట్ విమర్శలు గుప్పుమన్నాయి. దీనిపై పలువురు రాజకీయ నేతలు కూడా స్పందించారు. ఏది ఏమైనా అలా చేయడం దారుణమని మండిపడ్డారు.

ఉద్దేశపూర్వకమే!

యాదగిరి నర్సన్న సన్నిధిలో డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎంకు జరిగింది ముమ్మాటికీ అవమానమేనని దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్‌లో సీఎం తర్వాత హోదా కలిగిన డిప్యూటీ సీఎం పదవిని కించపరిచేలా క్యాబినెట్ మంత్రుల కన్నా తక్కువ స్థాయిలో కూర్చోబెట్టారని, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కూడా ఇదే పరిస్థితి ఎదురైందని, ఆమెను కూడా అగ్రవర్ణ మంత్రుల కన్నా తక్కువ స్థాయిలో కూర్చోబెట్టారని దళిత నేతలు విమర్శలు గుప్పించారు. యాదాద్రి పర్యటనలో ప్రోటోకాల్ మరిచి ఒక సామాజిక వర్గానికే మర్యాదలు చేయడం ఉద్దేశపూర్వక చర్యలేనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి

‘‘యాదాద్రీశుని సాక్షిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పి తీరాలి’’ అని బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా స్పందించారు. ‘‘యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా యావత్ దళిత జాతిని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అవమానించింది. దేవుడి సన్నిధిలోనే ఇంత అవమానం జరిగితే దళితులు తమ గోడును ఇంకెక్కడ మొరపెట్టుకోవాలి’’ అని ఆగ్రహించారు. ఈ అంశంపై కల్వకుంట్ల కవిత కూడా నల్గొండలో మీడియాతో మాట్లాడారు. ‘‘యాదాద్రి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖను సీఎం రేవంత్ అవమానించారు. వారిని కావాలనే తక్కువ ఎత్తులో కూర్చోబెట్టారు. ఇది చాలా దౌర్భాగ్యం. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి’’అని కోరారు.

యాదాద్రిలో జరిగింది ఇదే: భట్టి

సోషల్ మీడియాలో యాదాద్రి ఆలయంలో తనకు తీవ్ర అవమానం జరిగిందని సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ సర్కార్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పందించారు. మీరు అనుకుంటున్నట్లు అక్కడ ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. చిన్న పీట తానే కావాలని తెప్పించుకున్నానన్నారు. ‘‘ఎవరికో తలవంచేవాడిని, ఎవరో పక్క కూర్చోబెడితే కూర్చునేవాణ్ణి కాదు. యాదాద్రి ఆలయంలో కావాలనే చిన్న పీటపై కూర్చున్నాను. ఈ ఫొటో చూసి చాలా మంది తీవ్రంగా స్పందించారు. వారందరికీ నా కృతజ్ఞతలు. నన్ను అలా చూసి మీ మనసు కష్టపడి ఉంటుంది. ఇది ఎవరో కావాలని చేసిందేమీ కాదు. నేనే కావాలని అలా కూర్చున్నాను. ఇందులో వివాదం ఏమీ లేదు’’ అని హైదరాబాద్‌లో సింగరేణి గెస్ట్ హౌస్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఈ అంశంపై స్పష్టతనిచ్చారు.

ఆలయ అధికారులు ఏమన్నారంటే

భట్టి విక్రమార్క వివాదంపై యాదాద్రి ఆలయ ఈఓ రామకృష్ణారావు మాట్లాడారు. ఆలయంలో డిప్యూటీ సీఎంకు అవమానం జరిగిందనడం సరికాదన్నారు. దీనిపై నెట్టింట వస్తున్న విమర్శలను ఆలయ ఈఓగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆలయంలో రద్దీగా ఉంది. అందుకే పీట తీసుకురావడంలో ఆలస్యమైంది. అప్పుడు భట్టి విక్రమార్క అటు కూర్చున్నారని క్లారిటీ ఇచ్చారు. అంతేకానీ ఆయన అలా కూర్చోడం వెనక ఎవరి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు.


Tags:    

Similar News