పెద్దపల్లి బీజేపీ అభ్యర్ధిపై పెద్ద లొల్లి
తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బీజేపీలో పెద్ద లొల్లి వచ్చింది. ఇంతకీ ఆ లొల్లి ఏమిటంటే పెద్దపల్లి(ఎస్సీ) పార్లమెంటులో పోటీచేయబోయే అభ్యర్ధెవరు ?
తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బీజేపీలో పెద్ద లొల్లి వచ్చింది. ఇంతకీ ఆ లొల్లి ఏమిటంటే పెద్దపల్లి(ఎస్సీ) పార్లమెంటు నియోజకవర్గంలో పోటీచేయబోయే అధికారిక అభ్యర్ధి ఎవరు ? అనే అయోమయం పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే పార్టీ అధికారికంగా గోమాసె శ్రీనివాస్ ను అభ్యర్ధిగా ప్రకటించింది. కాబట్టి గోమాస తన నామినేషన్ తో పాటు బీఫారం కూడా అందించారు. ఇంతవరకు ఎలాంటి సమస్యా లేదు. అయితే నామినేషన్ల చివరిరోజున పార్టీ తరపున సీనియర్ నేత, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ కూడా నామినేషన్ వేశారు. కుమార్ నామినేషన్ వేశారని తెలియటంతోనే పార్టీలో గందరగోళం మొదలైంది. నామినేషన్ వేయటమే గందరగోళానికి దారితీసిందంటే విచిత్రం ఏమిటంటే కుమార్ బీఫారం కూడా అందించటం.
అంటే ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీ నుండి ఇద్దరు అభ్యర్ధులు బీ ఫారాలు అందించిన తర్వాత ఇక పార్టీలో లొల్లి మొదలుకాకుండా ఎలాగుంటంది ? కాంగ్రెస్ లో నుండి పార్టీలో చేరిన గోమాసను పార్టీ అధిష్టానం అభ్యర్ధిగా చాలా రోజుల క్రితమే ప్రకటించింది. గోమాస కూడా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే గోమాసె ప్రచారంలో బాగా వెనకబడిపోయారనే రిపోర్టు పార్టీ పెద్దలకు చేరింది. పార్టీ కూడా వివిధ మార్గాల్లో రిపోర్టు తెప్పించుకుంది. దాంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు గడ్డం వంశీకష్ణ, కొప్పుల ఈశ్వర్ కన్నా వెనకబడిపోయినట్లు సమాచారం అందింది. దాంతో అభ్యర్ధిని మార్చబోతున్నారనే ప్రచారం మొదలైంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతను తీసుకుని టికెట్ ఇవ్వబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
అయితే నామినేషన్ల ప్రక్రియతో వెంకటేష్ నేత బీజేపీలో చేరటంలేదనే విషయమై క్లారిటి వచ్చేసింది. దాంతో గోమాసె ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఊహించని రీతిలో చివరిరోజు ఎస్ కుమార్ నామినేషన్ వేయటంతో పాటు బీఫారం కూడా అందించటంతో పార్టీ నేతలు, క్యాడర్లో అయోమయం ఒక్కసారిగా పెరిగిపోయింది. గోమాసెకు పోటీగా ఎస్ కుమార్ నామినేషన్ ఎందుకు వేశారు ? పార్టీ బీఫారం ఎలా ఇచ్చింది ? అనే విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇద్దరు అభ్యర్ధులూ బీఫారాలు అందించటంతో పార్టీ అధికారిక అభ్యర్ధి ఎవరనే విషయంలో అయోమయం పెరిగిపోతోంది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. అంటే సాయంత్రం 3 గంటలకు ఇద్దరిలో ఎవరో ఒకరు తమ నామినేషన్ను ఉపసంహరించుకోవాల్సుంటుంది. అందుకనే నామినేషన్ను ఉపసంహరించుకునేది ఎవరనే విషయంలోనే పార్టీలో కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న గోమాసె పరిస్ధితి ఎస్ కుమార్ దెబ్బకు మరింత దిగజారిపోయింది.
మొత్తం 17 సీట్లలో మూడుచోట్ల అభ్యర్ధులను పార్టీ అధిష్టానం మార్చబోతోందనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతోంది. పెద్దపల్లితో పాటు భువనగిరి, హైదరాబాద్ లో కూడా అభ్యర్ధులను మార్చే విషయాన్ని పార్టీ ఆలోచిస్తోందని వార్తలు వచ్చాయి. పై మూడు నియోజకవర్గాల్లోను అధికారిక అభ్యర్ధులకు తోడు సీనియర్ నేతలు కూడా నామినేషన్లు వేయటంతో గందరగోళం పెరిగిపోయింది. అయితే భువనగిరి, హైదరాబాద్ లో అధికారికంగా శానంపూడి సైదిరెడ్డి, కొంపెల్ల మాధవీలత మాత్రమే బీఫారాలు అందించటంతో రెండు చోట్ల పరిస్ధితి సద్దుమణిగింది. అయితే పెద్దపల్లిలో ఇద్దరూ బీపారాలు అందించటంతో అయోమయం పెరిగిపోతోంది. అధికారిక అభ్యర్ధి ఎవరనేది తేలాలంటే మధ్యాహ్నం వరకు వెయిట్ చేయాల్సిందే.