ఫిరాయింపులపై సుప్రీం తీర్పు.. స్వాగతించిన పార్టీలు
న్యాయస్థానాలపై గౌరవం ఉందన్న కాంగ్రెస్. సరైన తీర్పంటున్న బీజేపీ.;
తెలంగాణలో ఫిరాయింపు నేతలపై వేటు వేయాలన్న బీఆర్ఎస్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాజకీయ పార్టీల స్పందన ప్రస్తుతం కీలకంగా మారింది. కాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతి పార్టీ కూడా స్వాగతించింది. న్యాయస్థానం తీర్పు ప్రకారం నడుచుకుంటామని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పది నియోజకవర్గాల్లో ఉపఎన్నికకు సిద్ధం కావాలంటూ మాజీ మంత్రి కేటీఆర్.. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఇతర పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా స్పందిస్తున్నారు. సుప్రీంకోర్టు చాలా మంచి తీర్పు ఒక పరిణామమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఫిరాయింపులను ఎంతగానో ప్రోత్సహించాయని ఆయన విమర్శించారు. ఆయనతో పాటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, కాంగ్రెస్ నేత ఆదిశ్రీనివాస్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా స్పందించారు.
న్యాయ నిపుణులతో చర్చించాకే నిర్ణయం: గడ్డం ప్రసాద్
‘‘ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు మూడు నెలల గడువు విధించడంపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే నిర్ణయానికి వెళ్తాం. మాజీ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఏం మాట్లాడారో అందరూ చూశారు. వాటిని కూడా పరిశీలిస్తున్నాం. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించిన తర్వాత అన్ని వివరాలు చెప్తా’’ అని గడ్డం ప్రసాద్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది: ఆది శ్రీనివాస్
‘‘న్యాయస్థానాలు అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో పదేళ్లు పరిపాలన కొనసాగించిన బీఆర్ఎస్.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలను వాళ్లు పార్టీలోకి చేర్చుకుంది. ఇప్పుడు వారి పార్టీ విధివిధానాలు నచ్చక బయటకు వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేసి వేధిస్తుంది. వారి అనర్హత పిటిషన్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని వాళ్లు పగటి కలలు కంటున్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై తుది నిర్ణయాధికారం స్పీకర్‌కే ఉందని బీఆర్ఎస్‌కూ తెలుసు. కానీ కావాలనే వాళ్లు నానా యాగీ చేస్తున్నారు’’ అని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
స్పీకర్ నిర్ణయం తీసుకుంటారే ఆశిస్తున్నా: రఘునందన్ రావు
‘‘సుప్రీంకోర్టు చెప్పినట్లుగానే ఫిరాయింపు వ్యవహారంలో స్పీకర్.. మూడు నెలల్లో ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను. లేనిపక్షంలో ఏం చేయాలనేది తీర్పులో చెప్పలేదు. ఒకవేళ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే దీనిని కార్యనిర్వాహక, శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య ఓ సంఘర్షణగా చూడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని స్పీకర్, కోర్టులు ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.
ఫిరాయింపుల అసలు విషయం ఏంటంటే..!
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఫిరాయింపులను సహించమని గప్పాలు కొట్టిన కాంగ్రెస్(Congress).. ఎందుకు బీఆర్ఎస్(BRS) నేతలను ఎందుకు పార్టీలోకి ఆహ్వానిస్తోందని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ జెండాతో ఎన్నికల్లో విజయం సాధించి అధికారం కోసం సిద్ధాంతాలను తుంగలో తొక్కి, పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన నేతలు వదిలి పెట్టమంటూ బీఆర్ఎస్ పెద్దలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అతి త్వరలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని, తెలంగాణలో ఉపఎన్నికలు రావడం తధ్యమని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై బీఆర్ఎస్.. హైకోర్టు(High Court)ను ఆశ్రయించినప్పటికీ అక్కడ ఆశించిన ఫలితం రాలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్‌దే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు ఆదేశాలను బీఆర్ఎస్.. సుప్రీంకోర్టు(Supreme Court)లో సవాల్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.