‘బీసీ రిజర్వేషన్లపై బీజేపీ మాట మార్చింది’
బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం.. తెలంగాణకు ఒక న్యాయమా..?;
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ద్వంద వైఖరిని అవలంభిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో బీజేపీ మాట మార్చిందని.. మొన్నటి వరకు ఒక మాట మాట్లాడి.. ఇప్పుడు ఇంకోమాట మాట్లాడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించుకున్నామని, ఇందుకోసం కేంద్రంలోని విపక్ష నేతలతో చర్చలు జరుపుతున్నామని రేవంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగానే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్‌లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని రేవంత్ గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలిపితే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్విహిస్తామని చెప్పారు.
‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ.. అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. ఇప్పుడు మాట మార్చి.. ముస్లిం రిజర్వేషన్లు తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ముస్లింల రిజర్వేషన్లను తొలగించాలని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం.. తెలంగాణకు ఒక న్యాయమా? యూపీ, గుజరాత్, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇప్పటి వరకు ఎందుకు తొలగించలేదు? ముస్లిం రిజర్వేషన్లు గుజరాత్‌లో దశాబ్దాల కాలం నుంచి ఉన్నాయని గతంలో మోదీ చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం ఒక వర్గం పేరు చెప్పి బీసీలకు అన్యాయం చేయాలని కమలం పార్టీ కుట్రలు పన్నుతోంది’’ అని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.