రక్తసిక్తమవుతున్న రోడ్లు... పెరుగుతున్న బైకర్ల ప్రమాదాలు

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు అధికం...ఇదే రోడ్డు ప్రమాదాలకు కారణం...

Update: 2025-10-28 04:30 GMT
బైక్ ప్రమాదం (ఫైల్ ఫొటో)

రోడ్లపై వేగం.. మద్యం కిక్కు.. నిర్లక్ష్యం... ఈ మూడూ కలిసినప్పుడు ప్రమాదం తప్పదు. ప్రతి రోజు ఎక్కడో ఒకచోట ప్రాణాలు రోడ్డుపైనే పోతున్నాయి. హెల్మెట్ లేకుండా బైక్ రైడ్‌లు, మద్యం తాగి స్టీరింగ్ పట్టేవాళ్లు, ట్రాఫిక్ నిబంధనలను తేలికగా తీసుకునేవాళ్లు — వీళ్ల నిర్లక్ష్యం ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తుందో లెక్కే లేదు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రోజుకో ప్రమాదం, రోజుకో చావు. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా, డ్రంకెన్ డ్రైవింగ్ తగ్గడం లేదు. ఈ పరిస్థితి రోడ్లను రక్తపుటేరులుగా మారుస్తోంది.ఒక సిప్ మద్యం, ఒక తప్పు నిర్ణయం, ఒక ప్రాణం కాదు — ఎన్నో కుటుంబాల భవిష్యత్తును బూడిద చేస్తోంది.


పీకల దాకా మద్యం తాగి వాహనాలు నడపటం...మితిమీరిన వేగం...ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం...మైనర్లు ద్విచక్రవాహనాలను నడపటం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోనే ఏటా లక్షకు పైగా డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదవుతున్నాయంటే మందుబాబుల డ్రైవింగ్ ఏ స్థాయిలో ఉందో విదితమవుతుంది. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి కఠిన శిక్షలు, జరిమానాలు విధిస్తున్నా మందుబాబుల డ్రైవింగ్ కు తెర పడటం లేదు.

జాతీయ రహదారులపై బైకర్ల మృత్యువాత అధికం
జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో బైకర్లు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడైంది. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి బైకర్ యాక్సిడెంటే మూలమని తేలింది. బైకర్ మద్యం తాగి జాతీయ రహదారిపై బైక్ నడిపి ప్రమాదం చేసి తాను మరణించడమే కాకుండా మరో బస్సును ప్రమాదంలో నెట్టేసి 19 మంది మృతికి కారణమయ్యాడు.కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2025 మొదటి అర్ధభాగంలో నమోదైన 26,770 రోడ్డు ప్రమాద మరణాల్లో ద్విచక్ర వాహనదారులే ఎక్కువ మంది ఉండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది.

రోజుకు 40 బైక్ యాక్సిడెంట్లు...
తెలంగాణలో రోజుకు సగటున 40 బైక్ యాక్సిడెంట్లు జరుగుతుండగా 11మంది మరణిస్తున్నారు. 2023వ సంవత్సరంలో 22,903 రోడ్డు ప్రమాదాలు జరగ్గా అందులో 7,660 మంది మరణించారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఢీకొనడం వల్ల మోటార్‌సైకిలిస్టులకు 55 శాతం మంది ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో లెక్కలే తేటతెల్లం చేశాయి. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని జాతీయ రహదారులపై బైక్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తేలింది. హెల్మెట్ ధరించక పోవడం వల్ల 68 శాతం మంది యువత ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని వెల్లడైంది. 2023వ సంవత్సరంలో 14,385 బైక్ యాక్సిడెంట్లు జరగ్గా 3,844 మంది మృత్యువాత పడ్డారు.

హైదరాబాద్‌లోనే డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల సంఖ్య లక్ష
హైదరాబాద్ నగరంతోపాటు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పోలీసులు వరుస తనిఖీలు చేస్తున్నా మందుబాబులు పీకల దాకా మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ నగరంలో మద్యం తాగి వాహనం నడిపిన కేసుల సంఖ్య చూస్తే షాక్ అవ్వాల్సిందే. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 37,866 మంది, సైబరాబాద్ పరిధిలో 52,124 మంది,రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 16,594 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాపిక్ పోలీసులకు దొరికారు.



 మందుబాబులకు జైలు శిక్ష

తాగి వాహనాలు నడుపుతున్న మందుబాబులకు జరిమానాలు, శిక్షలు వేస్తున్నా డ్రంకెన్ డ్రైవింగు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ నగరంలో మద్యం తాగి వాహనం నడిపినందుకు 5,032 మందికి జైలు శిక్ష కూడా విధించారు. సంవత్సరం ఎండింగ్ డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు 3,000 మందిపై నమోదు చేశారంటే దీని తీవ్రత తెలుస్తుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలలో మద్యం తాగి వాహనం నడిపిన వారిపై తనిఖీలు ఏడాది పొడవునా కేంద్రీకృత ట్రాఫిక్ ఉల్లంఘనగా మిగిలిపోయాయి. ఉల్లంఘించిన వారిపై పోలీసులు 1.06 లక్షల కేసులు నమోదు చేశారు. ఈ ఉల్లంఘనలకు సంబంధించి ఆర్టీఏ అధికారులు 4,000 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు.హైదరాబాద్ నగరంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్లే జరుగుతున్నాయని రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు చెప్పారు.

మందుబాబులకు పోలీసు కౌన్సెలింగ్
బ్రీత్ అనలైజర్‌లతో కూడిన బృందాలు రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలపై ఎక్కువ దృష్టి సారించి తనిఖీలు చేస్తున్నామని ఆయన చెప్పారు. మద్యం తాగి వాహనం నడిపినవ్యక్తిపై కేసు నమోదు చేసిన తర్వాత, ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘించిన వ్యక్తి కుటుంబ సభ్యుడితో పాటు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేలా చూస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన వారిపై పోలీసులు ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నారు.ఒక వ్యక్తి రెండవసారి లేదా పలుసార్లు పట్టుబడిన సందర్భాల్లో కోర్టులు వారిని ఒక రోజు నుంచి 15 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలుకు పంపుతున్నాయని రాచకొండ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ట్రాఫిక్ పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్‌లను స్వాధీనం చేసుకుని, లైసెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ రోడ్డు రవాణా అథారిటీకి పంపుతున్నారు. తాగిన వాహనం నడిపినందుకు హైదరాబాద్ లో 3,782 మంది, సైబరాబాద్ లో 979 మంది,రాచకొండ పోలీసు కమిషనరేట్ లో 271 మందికి జైలు శిక్ష పడింది.

జాతీయ రహదారులపై మద్యం కిక్కు
తెలంగాణలోని జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు ఎక్కువగా ఉండటంతో డ్రైవర్లు సైతం మద్యం తాగుతున్నారు. దీనివల్ల జాతీయ రహదారులపై భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బైకర్సే కాకుండా కార్లు, బస్సులు, లారీల డ్రైవర్లు కూడా మద్యం తాగి వాహనాలు నడుపుతుండటం ప్రమాదాలకు దారి తీస్తుంది. హైదరాబాద్- బెంగళూరు 44వ నంబరు జాతీయ రహదారిపై పలు మద్యం షాపులు, బార్ లు, రెస్టారెంట్లు వెలిశాయి. దీనికి తోడు బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి. హైదరాబాద్- నాగపూర్, హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్ - ఖమ్మం ఇలా పలు జాతీయ రహదారులపై రెండు వైపులా మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు వెలిశాయి. దీనివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలంగాణ ట్రాఫిక్ పోలీసు అధికారి కె నవీన్ కుమార్ చెప్పారు.

బైకర్ డ్రంకెన్ డ్రైవింగే ప్రమాదానికి కారణం
కర్నూల్ జిల్లాలో పుల్లూరు టోల్ గేటు వద్ద బైకర్ శివశంకర్ మద్యం తాగి జాతీయ రహదారిపై బైక్ నడుపుతూ ప్రమాదానికి గురై మరణించాడు. బైక్ రోడ్డు మధ్యలో పడటంతో దాని మీదుగా వేమూరి కావేరి బస్సును నడపటం వల్ల ఘోర ప్రమాదం జరిగి 19 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. కర్నూల్ జిల్లాకు చెందిన శివశంకర్ తన స్నేహితుడు ఎర్రిస్వామితో కలిసి రాత్రి 2 గంటలకు లక్ష్మీపురం మద్యం బెల్ట్ షాపు వద్ద పీకల దాకా మద్యం తాగి పల్సర్ బైక్ నడుపుతూ ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ లో వెలుగుచూసింది. శివప్రసాద్ మద్యం మత్తులో కియా షోరూం వద్ద ఉన్న పెట్రోల్ బంకులో 300రూపాయల పెట్రోలు పోయించుకొని రాష్ గా బైక్ నడుపుతూ సీసీటీవీ ఫుటేజీకి చిక్కారు. వేమూరి కావేరి బస్సు ప్రమాదానికి బైకర్ మద్యం తాగడమే ప్రధాన కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది.జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో బైకర్లు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు.నేషనల్ హైవేలపై హిట్-అండ్-రన్ ప్రమాదాలు సంభవిస్తున్నాయని రోడ్డు-భద్రతా పరిశోధకులు చెబుతున్నారు. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (CRRI) చేసిన అధ్యయనంలో ద్విచక్ర వాహన ప్రమాదాల్లో తల, మెడ గాయాలు మరణానికి ప్రధాన కారణంగా ఉన్నాయని తేలింది. బైకర్లు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అయినప్పటికీ దీని ఉల్లంఘన కొనసాగుతుంది.దీనికి తోడు మితిమీరిన వేగం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

డ్రంకెన్ డ్రైవర్లే ఉగ్రవాదులు...సీపీ సజ్జనార్ వ్యాఖ్యలు
‘‘కర్నూలులో జరిగిన భయంకరమైన బస్సు ప్రమాదం కాదు,మద్యం తాగిన బైకర్ నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా ప్రవర్తించడం వల్ల జరిగిన నివారించదగిన మారణహోమం’’ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ అభివర్ణించారు. రోడ్డుపై మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని ఉగ్రవాదులుగా ఆయన అభివర్ణించారు. ‘‘మద్యం తాగిన డ్రైవర్లు జీవితాలను, కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేస్తున్నందున వారు ప్రతి కోణంలోనూ ఉగ్రవాదులే అనే నా ప్రకటనకు నేను గట్టిగా కట్టుబడి ఉన్నాను’’అని సీపీ చెప్పారు. ఇప్పటి నుంచి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ప్రతి వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సజ్జనార్ పేర్కొన్నారు.

మద్యం తాగి వాహనం నడపడం కేవలం చట్ట ఉల్లంఘన మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి జీవితానికీ, కుటుంబాల భవిష్యత్తుకి ప్రాణాంతక ప్రమాదం. పోలీసులు, ట్రాఫిక్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా, జాగ్రత్త, బాధ్యతా చైతన్యం లేకపోతే ఈ గణనీయమైన ప్రమాదాలు తగ్గవు. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడం మన అందరి బాధ్యత. ఒక్క చిన్న జాగ్రత్త, ఒక్క చిన్న నిర్ణయం జీవితాలను కాపాడుతుంది.


Tags:    

Similar News