ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్‌ఎన్ రెడ్డి

ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు పోటాపోటీగా నిందితులను విచారిస్తున్నాయి.;

Update: 2025-01-10 06:28 GMT

ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు పోటాపోటీగా నిందితులను విచారిస్తున్నాయి. ఈ కేసు విషయంలో ఏసీబీ, ఈడీ రెండూ కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగానే హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్‌ రెడ్డిని శుక్రవారం ఏసీబీ విచారిస్తోంది. ఈ మేరకు ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విచారణలో హెచ్ఎండీఏ నిధులను ఫార్ములా-ఈ ఆపరేషన్స్ సంస్థకు బదిలీ చేసిన అంశంపై ఏసీబీ కీలకంగా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. గురువారం విచారణకు హాజరైన సీనియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్ తన విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా శుక్రవారం బీఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీఎల్ఎన్ రెడ్డిని గత వారం ఈడీ అధికారులు దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించారు. పలు కీలక అంశాలపై ప్రశ్నలు సంధించారు.

బీఎల్ఎన్ రెడ్డిపై మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన సహా పలు ఇతర అభియోగాలు కూడా ఉన్నాయి. అయితే ఫార్ములా ఈ-కార్ రేసు సీజన్ 10 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ విభాగం, ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంయుక్తంగా రూ.110కోట్లు ఎఫ్ఈఓకు చెల్లించడానికి ఒప్పందం చేసుకున్నారు. మొదటి వాయిదా కింద ఆ ఏడాది సెప్టెంబర్ 25న రూ.22,69,63,125, 29న తేదీన రెండో విడతలో రూ.23,01,97,500 చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు నిధులను హెచ్ఎండీఏ బోర్డు ఖాతా నుంచి బ్రిటన్‌కు బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. అనుకున్న విధంగా తొలి విడత మొత్తం అక్టోబర్ 3న, రెండో విడత నగదు అక్టోబర్ 11న మంజూరు చేశారు. కాగా ఈ మొత్తం రూ.45.71కోట్లు, ఐటీ శాఖకు పెనాల్టీగా చెల్లించిన రూ.8 కోట్లు మొత్తం కలిసి రూ.54.89 కోట్లు లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ లావాదేవాలకు సంబంధించి ఇంకా క్లియర్ పిక్చర్ రావాల్సి ఉండగా, వాటిపైనే బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News