గోల్కొండ జగదాంబ దేవాలయంలో ఘనంగా బోనాలు

ఆశాడ మాస ఆదివారం కావడంతో విశేష పూజలు;

Update: 2025-07-06 08:00 GMT

ఆశాడమాసం ఆదివారం వస్తే చాలు జాతరే జాతర. గోల్కొండలో ప్రారంభమైన ఆశాడ మాస బోనాలుతో హైద్రాబాద్ లో   వేడుకలు ప్రారంభమయ్యాయి. హైద్రాబాద్ బోనాలు గోల్కొండలో తొలి బోనంతో ప్రారంభమౌతుంది. మిగతా జిల్లాలో శ్రావణమాసంలో ప్రారంభమౌతాయి. నెల రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తెలంగాణ జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు. గోల్కొండ జగదాంబ దేవాలయంలో కాకతీయుల కాలం నుంచి బోనాలు వేడుకలు జరుగుతున్నాయి. నాలుగు శతాబ్దాల  క్రితం కుతుబ్ షాహీ పాలన ప్రారంభమైంది. కుతుబ్ షాహీల పాలనలో  అమ్మవారు వైభవోపేతంగా పూజలందుకున్నారు. ముస్లిం పాలకులు కూడా అమ్మవారికి ముక్కుపుడక, బంగారు కిరీటంతో అలంకరించేవారని చరిత్రకారులు చెబుతారు. అమ్మవారికి పూజలు చేయడం సాంప్రదాయంగా రావడంతో మత సామరస్యానికి జగదాంబ దేవాలయం ప్రతీకగా నిలిచింది. గోల్కొండ కోట ప్రాంగణంలో వెలిసిన ఈ అమ్మవారి దేవాలయానికి ఆశాడ మాసంలో వచ్చే ప్రతీ ఆదివారం మాదిరిగా ఇవ్వాళ కూడా భక్తుల తాకిడి పెరిగింది. ప్రసిద్ది ఆలయంగా పేరు గాంచిన జగదాంబ దేవాలయానికి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహరాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆదివారం జరిగిన జాతరకు భక్త జనకోటి జనం తరలి వచ్చింది. ప్రతీ గురువారం, ఆదివారం జరిగే బోనాల వేడుకలకు భక్తులు విశేషంగా హాజరౌతున్నారు. ఇక్కడి జగదాంబ అమ్మవారికి మహిమలు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆశాడమాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. అమ్మవారికి ఇష్టమైన బెల్లం, పుట్నాలను భక్తులు నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తుల కోసం దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. గోల్కొండలో ప్రారంభమైన ఈ వేడుకలకు దేవాదాయశాఖమంత్రి కొండా సురేఖ జగదాంబ దేవాలయాన్ని దర్శిచి మొక్కులు సమర్పించుకున్నారు.

డప్పుల, డాన్సులు, పోతరాజుల నృత్యాలతో జగదాంబ దేవాలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.

గత నెల 29న ప్రారంభమైన హైద్రాబాద్ బోనాలు ఈ20వ తేదీన గోల్కొండ చివరి బోనంతో ముగుస్తాయి.

Tags:    

Similar News