నాగర్ కర్నూల్ టికెట్‌ ఆర్‌ఎస్‌పీదే.. ప్రకటించిన బీఆర్ఎస్

మెదక్, నాగర్ కర్నూల్ నుంచి లోక్‌సభ బరిలో దిగనున్న తమ అభ్యర్థులను బీఆర్ఎస్ నేడు ప్రకటించింది. ఇందులో ఎవరూ ఊహించని నేత పేరు ఖరారు కావడం ఆసక్తికరంగా మారింది.

Update: 2024-03-22 09:47 GMT
Source: Twitter

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేడి రోజురోజుకు అధికమవుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు మారుతున్న నేతల సంఖ్యా పెరుగుతోంది. ఇందులో ఎక్కువ మంది నేతలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాగర్‌ కర్నూల్, మెదక్ స్థానాల్లో తమ తరపున బరిలోకి దిగే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వీటిలో మెదక్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ పీ వెంకట్రాంరెడ్డి ఖరారు చేసింది. నాగర్ కర్నూల్ నుంచి ఇటీవల బీఆర్ఎస్ కండువా కప్పుకున్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు అందించింది.

మెదక్ నుంచి స్వయంగా గులాబీ బాస్ కేసీఆరే రంగంలోకి దిగుతారని అంతా అనుకున్నారు. అటువంటిది అనూహ్యంగా అక్కడి నుంచి వెంకట్రామిరెడ్డి బరిలోకి దిగనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఒకవేళ కేసీఆర్ పోటీ చేయకుంటే మెదక్ నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి నిలబడతారంటూ వార్తలు వచ్చాయి. కానీ అందరి అంచనాలకు భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ వెంకట్రామిరెడ్డి పేరును ప్రకటించింది. అయితే నుంచి బీజేపీ తరపున రఘునందరావు ఎన్నికల బరిలో నిలబడనుండగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. ప్రస్తుతానికి మెదక్ ఎంపీ టికెట్‌ కోసం నిర్మలా జగ్గారెడ్డి, నీలం మధు, మైనంపల్లి హనుమంతరావు పేర్లు వినిపిస్తున్నాయి.

లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్‌పీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని ఇటీవల గులాబీ బాస్ కేసీఆర్, బీఎస్‌పీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ సంయుక్తంగా ప్రకటించారు. అప్పుడే తాను అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నానని ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారారు. అయినా నాగర్ కర్నూల్ టికెట్‌ను కేసీఆర్.. ఆర్ఎస్‌పీకే ఇచ్చారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున మల్లు రవి బరిలో దిగనున్నారు. నాగర్‌ కర్నూల్‌లో మల్లురవికి మంచి ఫాలోయింగే ఉంది. అదే విధంగా ఇక్కడి నుంచి బీజేపీ తరపున పీ భరత్.. ఎన్నికల బరిలో నిలబడనున్నారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ జరగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News