బలిపశువు అవుతోన్న బీఆర్ఎస్..!

రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి. కానీ రెండు పార్టీలు రాష్ట్రంలో వింత వైఖరిని అవలంబిస్తున్నాయి. వీరి అటాక్ లో బలౌతోంది మాత్రం బీఆర్ఎస్ అనే చెప్పాలి.

Update: 2024-08-16 16:57 GMT

రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి. కానీ రెండు పార్టీలు రాష్ట్రంలో వింత వైఖరిని అవలంబిస్తున్నాయి. వీరి అటాక్ లో బలౌతోంది మాత్రం బీఆర్ఎస్ అనే చెప్పాలి. రేవంత్ సహా కాంగ్రెస్ బృందమంతా సందర్భమేదైనా బీఆర్ఎస్ వైపే తొమ్మిది వేళ్ళు చూపిస్తున్నాయి. అడపాదడపా ఒక వేలు బీజేపీవైపు వెళుతోంది. ఇక బీజేపీ నేతలది కూడా ఇదే తంతు. ప్రభుత్వం పైన కంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. 

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం...

ఇటీవల కాంగ్రెస్ శ్రేణులు ఓ ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ పర్యటనలు కవిత కోసం కాదు. బీజేపీతో డీల్ సెట్ చేసుకోడానికి అని సోషల్ మీడియాలో మోగించేస్తున్నారు. ఎప్పటి నుంచో బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే అని చెబుతోన్న రేవంత్... నేడు ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. "బీఆర్ఎస్ బీజేపీలో విలీనం తధ్యం. ఇప్పుడు ఖండించినా ఎప్పటికైనా అది జరగకమానదు, కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కేంద్రమంత్రి, హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారు. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉంది. వీళ్లంతా బీజేపీలో విలీనం అయ్యాక కవితకి రాజ్యసభ ఇస్తారు" అని రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 

కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం...

కేంద్రమంత్రి బండి సంజయ్ నేడు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు. "కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యం. ఈ క్రమంలోనే కేసీఆర్ కి ఏఐసీసీ, కేటీఆర్ కి పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం" అంటూ సెటైర్ వేశారు. "బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఆ పార్టీల సొంతం. కవిత బెయిలుతో బీజేపీకి ఏం సంబంధం? బీఆర్ఎస్ పార్టీది ముగిసిన అధ్యాయం. ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదు. బీఆర్ఎస్ ని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. అతి త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమవడం తథ్యం" అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

బలైతున్న బీఆర్ఎస్...

బీజేపీ లో బీఆర్ఎస్ విలీనం విషయంలో నిజమెంతో తెలియదు కానీ రేవంత్ రెడ్డి అండ్ కో వ్యూహాత్మకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనే సందేహం కలగకమానదు. బీఆర్ఎస్ పనైపోయింది అనే లైన్ ని రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచీ ప్రతి ప్రచారంలోనూ ఉపయోగించారు. ప్రజల మెదడుల్లోకి ఈ విషయాన్ని బాగా ఎక్కించే ప్రయత్నం చేశారు. రిజల్ట్ కూడా అదే స్థాయిలో కనిపించింది. అసలు భూస్థాపితం అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ గెలవడం, బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగిపోయాయి. దీంతో ఇదే లైన్ ని పార్లమెంటు ఎన్నికల్లోనూ బాగా వాడేశారు. బీఆర్ఎస్ పనైపోయింది, ఒక్క సీటు కూడా రాదు అని రేవంత్ చెప్పారు. జనం నిజం చేసి చూపించారు.

ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. వీటిలో ఎంతోకొంతో బీఆర్ఎస్ ప్రభావం ఉండొచ్చు. అందుకే రేవంత్ తెలివిని ఉపయోగించి, ఈసారి ఏకంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే స్లోగన్ ఎత్తుకున్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ బతుకు బస్టాండ్ అని రేవంత్ అంటుంటే... బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదు అంటూ పూర్తిగా తీసేసినట్టు మాట్లాడటం గమనార్హం. ఈ రెండు పార్టీల పోరులో బీఆర్ఎస్ బలిపశువు అవడం 'తధ్యం' ఏమో!

Tags:    

Similar News