తెలంగాణ ప్రాజెక్టులకు వరద ముప్పు

కుండపోత వర్షాలతో పలు ప్రాజెక్టులు, జలాశయాల్లోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరింది.;

Update: 2025-08-28 01:07 GMT
పోచారం ప్రాజెక్టులో ప్రవహిస్తున్న వరదనీరు

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీవర్షాల వల్ల పలు ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కుండపోత వర్షాల వల్ల మిడ్ మానేరు రిజర్వాయర్ లోకి లక్ష క్యూసెక్కుల నీరు వస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు. మిడ్ మానేరు జలాశయంలో 17 గేట్లు తెరచి 45వేల క్యూసెక్కుల వరదనీటిని లోయర్ మానేరు జలాశయంలోకి విడుదల చేశారు. మరో 9,600 క్యూసెక్కుల నీటిని అన్నపూర్ణ రిజర్వాయరులోకి విడుదల చేశారు. నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులకు వరదనీరు భారీగా చేరింది. సింగూరు నది వరదనీరు చేరి నిండింది.బీబీపేటతోపాటు పలు చెరువులు నిండిపోయి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి.


జంట జలాశయాలకు వరద
హైదరాబాద్ నగరానికి మంచినీరందిస్తున్న జంట జలాశయాలు వరదనీటితో నిండిపోయాయి. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్థుతం 1789 అడుగుల మేర నీరు చేరింది. దీంతో రెండు గేట్లు తెరచి 226 క్యూసెక్కుల వరదనీటిని మూసీనదిలోకి వదిలారు. హిమాయత్ సాగర్ రిజర్వాయరు పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా ప్రస్థుతం దీనిలోకి 1762.82 అడుగుల నీరు చేరింది. దీంతో ఒక గేటు తెరచి 339 క్యూసెక్కుల వరదనీటిని మూసీలోకి వదిలారు. మూసీ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.



 లోతట్టుప్రాంతాలు జలమయం

వరదనీటితో కామారెడ్డిలోని పలు లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదనీటి ప్రవాహంతో 44 నంబరు జాతీయ రహదారిని మూసివేశారు.కామారెడ్డి జిల్లాల్లో కేవలం 14 గంటల్లో 499 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.వరదనీరు పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. గోస్కే రాజయ్య కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు సహాయం కోసం తమ పైకప్పులపైకి పరుగులు ఎక్కారు. నక్కవాగు వాగులో ఒక కుటుంబం కారు కొట్టుకుపోయింది.

కొట్టుకుపోయిన రైలు పట్టాలు
భిక్కనూర్-తల్మడ్ల, అకాన్‌పేట్-మెదక్ మధ్య రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతిన్నాయి. రాకపోకలు నిలిచిపోయి పలుగ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.


Tags:    

Similar News