Harish arrest|బీఆర్ఎస్ కీలకనేత హరీష్ అరెస్ట్
హరీష్ తమ పార్టీ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళినపుడు పోలీసులు అరెస్టుచేశారు.;
బీఆర్ఎస్ కీలకనేత, మాజీమంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టుచేశారు. హరీష్ తమ పార్టీ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) ఇంటికి వెళ్ళినపుడు పోలీసులు అరెస్టుచేశారు. గురువారం ఉదయం బంజారాహిల్స్(Banjara Hills) లోని హుజూరాబాద్ ఎంఎల్ఏ పాడి ఇంటికి పోలీసులు వెళ్ళారు. కౌశిక్ ను అరెస్టుచేసేందుకే పోలీసులు అక్కడికి వెళ్ళారు. తమ ఎంఎల్ఏ పాడిని పోలీసులు అరెస్టుచేయబోతున్న విషయం తెలుసుకున్న హరీష్ తదితరులు వెంటనే కౌశిక్ ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసులు ఎవరినీ ఇంట్లోకి పంపలేదు. దాంతో హరీష్ తదితరులతో పోలీసులకు పెద్ద వాగ్వాదం జరిగింది.
పాడి ఇంటినుండి హరీష్ తదితరులను వెళ్ళిపొమ్మని పోలీసులు ఎంతచెప్పినా వినలేదు. దాంతో వేరేదారిలేక పోలీసులు హరీష్(Harish Rao) ను అరెస్టుచేసి అక్కడినుండి తరలించారు. ఇంతకీ పోలీసులు ఇంతపొద్దునే పాడి ఇంటికి ఎందుకు చేరుకున్నట్లు ? ఎందుకంటే బుధవారం రాత్రి పాడి తన అనుచరులతో బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ కు వెళ్ళాడు. తన ఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) అవుతోందనే ఫిర్యదు ఇవ్వటానికి వెళ్ళాడు. తన ఫోన్ ట్యాపింగ్ అవటానికి కారణం ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, రేవంత్ రెడ్డే(Revanth Reddy) అని ఫిర్యాదులో పాడి రాశాడు. తన ఫిర్యాదును తీసుకుని వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాలని ఇన్సెపెక్టర్ పై బాగా ఒత్తిడి తెచ్చాడు. పాడి వస్తున్న విషయం తెలుసుకుని సీఐ తన స్టేషన్లో నుండి బయలుదేరారు.
అదే సమయానికి స్టేషన్ కు చేరుకున్న పాడి మద్దతుదారులు సీఐను బయటకు వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. తనకు బయట అత్యవసరమైన పని ఉందని సీఐ చెప్పినా ఎంఎల్ఏ మద్దతుదారులు వినిపించుకోలేదు. ఒకవిధంగా తన స్టేషన్లోనే సీఐని పాడి మద్దతుదారులు నిర్భంధించినట్లయ్యింది. తర్వాత స్టేషన్ కు చేరుకున్న పాడి కూడా సీఐతో పెద్దగా వాగ్వాదానికి దిగారు. తన ఫిర్యాదును తీసుకుని ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టరంటు సీఐతో పాడి పెద్ద గొడవపెట్టుకున్నాడు. ఎంఎల్ఏ నుండి ఫిర్యాదు తీసుకున్న సీఐ తర్వాత అందరినీ పంపిచేసి తాను కూడా వెళ్ళిపోయాడు. జరిగిన విషయాన్ని సీఐ తన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు. దాంతో విధులు నిర్వర్తించకుండా పాడి అడ్డుకున్నారని సీఐ ఫిర్యాదుతో పాడిపై కేసు నమోదైంది.
అందుకనే గురువారం ఉదయం పాడిని అరెస్టుచేయటానికి పోలీసులు పెద్దఎత్తున ఎంఎల్ఏ ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంట్లోనుండి పాడి ఎంతకీ బయటకు రాలేదు. ఇంట్లో నుండి ఎంఎల్ఏ బయటకు రాగానే అరెస్టుచేయటానికి ఇంటిబయట పోలీసులు మోహరించున్నారు. ఈ నేపధ్యంలోనే హరీష్ తో పాటు మద్దతుదారులు పాడి ఇంటికి వచ్చి గొడవ చేసినపుడు పోలీసులు అరెస్టులు చేసి గచ్చిబౌలి పోలీసుస్టేషన్ కు తరలించారు. విషయం తెలిసి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాడి ఇంటికి చేరుకుంటుండటంతో ఇంటిదగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది.