బీఆర్ఎస్ నేతలు హౌస్ అరెస్ట్

హైదరాబాద్‌లో పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్లి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు.

Update: 2024-09-13 10:20 GMT

హైదరాబాద్‌లో పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్లి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అలెర్ట్ అయిన పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.

మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును కోకాపేటలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్టు చేశారు. గురువారం కమిషనర్ కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో తన భుజానికి గాయమైందని, హాస్పిటల్ కి వెళ్ళాలని హరీష్ చెప్పినప్పటికీ పోలీసులు నిరాకరించారు. కావాలంటే తామే హాస్పిటల్ కి తీసుకెళ్తమంటూ ఇంటివద్దే నిర్బంధించారు. హరీష్ రావు నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను నివాసం లోపలకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు గేటు బయటే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.




 

శ్రీనగర్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డిని, వెస్ట్ మారేడ్ పల్లి నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును సైతం హౌస్ అరెస్టు చేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద నివాసం, క్యాంపు ఆఫీసు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి నుంచి బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా బయల్దేరాలని నిర్ణయించారు. దీంతో ఆయన నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి ఇళ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.




 

అరికెపూడి గాంధీ నివాసానికి బయల్దేరిన కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజును పోలీసులు అడ్డుకున్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంటికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని, దానం నాగేందర్ ను ఎందుకు అడ్డుకోలేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో కాంగ్రెస్ నేతలు సమావేశం ఏర్పాటు చేసుకుంటే తప్పు లేదు కానీ మేము ఎందుకు సమావేశం నిర్వహించకూడదు అని నిలదీశారు.

Tags:    

Similar News