ఆ గుర్తులను తొలగించండి: బీఆర్ఎస్
ఎన్నికల కమిషనర్‌ను కలిసిన గులాబీ నేతలు.;
తెలంగాణలో స్థానిక సంస్థల హడావుడీ మొదలైంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. వాటిని ఆచరణలో కూడా పెట్టేస్తున్నాయి. ఈ క్షణానైనా షెడ్యూల్ రావొచ్చని ఫిక్స్ అయిన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఫుల్ ఫోకస్ పెట్టి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం బీఆర్ఎస్ నేతలు భరత్ కుమార్, వినోద్ కుమార్.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. ఎన్నికల గుర్తులపై ఆయనకు వినతి పత్రం అందించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కారును పోలి ఉన్న గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని కోరారు. కారును పోలి ఉన్న గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయలో కారును పోలి ఉన్న చపాతీ రోలర్, కెమెరా, షిప్ గుర్తుల వల్ల తమ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని, ఈసారి అలా కాకుండా ఉండటం కోసం ఈమేరకు కోరుతున్నామని వారు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. అందుకే కారును పోలి ఉన్న గుర్తులను ఏ పార్టీకి, వ్యక్తులకు కేటాయించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరారు.
భయమా ముందు జాగ్రత్తా..!
బీఆర్ఎస్ నేతలు వెళ్లి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలవడం అనేక చర్చలకు దారితీస్తోంది. షెడ్యూల్ కూడా రాకముందే గులాబీ దళంలో గుబులు పుట్టిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో తమకు అడ్డంకులు లేకుండా వెళ్తున్నారని మద్దతు పలుకుతున్నారు. కానీ బీఆర్ఎస్‌లో భయం మొదలైందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ పరువు పోయిందని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటమి పాలైతే ప్రజల ముందు తలెత్తుకోలేమని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందని, అందుకనే ఎలాగైనా గెలవాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని ఆదేశించిందని విశ్లేషకులు అంటున్నారు.
అదే విధంగా పార్టీ ముందు ఎటువంటి అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత, నేతల మధ్య ఉద్భవిస్తున్న సమస్యలను పరిష్కించడం, ఇలా ప్రతి అంశాలను కొందరు నేతలకు కేటాయించారని సమాచారం. అందులో భాగంగానే పార్టీ ముందు అడ్డంకులు, ఇబ్బందులను తొలగించే బాధ్యతను వినోద్, భరత్‌కు అప్పగించారని, అందులో భాగంగానే వారు ఎన్నికల కమిషనర్‌ను కలిశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పార్టీ పెద్దలు చేస్తున్న ఈ ప్రయత్నాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎంత మాత్రం కలిసిస్తోయో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.