బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా, ఏనుగుల రాకేష్ రెడ్డి అరెస్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డిలను పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్టు చేశారు.

Update: 2024-07-01 10:39 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డిలను పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రి వద్ద నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకి మద్దతుగా వచ్చిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్లా, రాకేష్ రెడ్డిలతోపాటు, అపీలువురు బీఆర్ఎస్ నాయకులను, విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు.

కాగా, నిరుద్యోగుల సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలంటూ ఓయూ నిరుద్యోగ జేఏసీ నాయకుడు గత సోమవారం యూనివర్సిటీలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. మోతీలాల్ ఆరోగ్యం క్షీణించడంతో అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనూ అతను నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోతీలాల్ కి మద్దతుగా విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేశారు. రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. భారీగా గాంధీ ఆసుపత్రికి తరలివస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగుల సమాస్యలను పరిష్కారించాలంటూ డిమాండ్ చేస్తూ ఆసుపత్రి బయట నిరసన చేపట్టారు. వీరి ఆందోళనకి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది.

ఆదివారం రాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గాంధీ ఆసుపత్రికి వెళ్లి మోతీలాల్ నాయక్ ని పరామర్శించారు. చర్చలు విఫలం అవడంతో మోతీలాల్ దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు విద్యార్థి నేతను పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి, ఇతర పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

'మోతీలాల్‌కు హాని జరిగితే సర్కారుదే బాధ్యత'

మోతీలాల్‌కు హాని జరిగితే సర్కారుదే బాధ్యత అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వెంటనే నిరుద్యోగులతో చర్చలు జరపాలని, మోతీలాల్‌ నాయక్‌ ఆమరణ నిరాహారదీక్షను విరమింపజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వారం రోజులుగా నిరుద్యోగుల తరఫున ఆమరణ దీక్ష చేస్తున్న మోతీలాల్‌నాయక్‌ను ఆదివారం సికింద్రాబాద్‌ గాంధీ హాస్పిటల్ లో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అసెంబ్లీని స్తంభింపజేస్తామని చెప్పారు. మోతీలాల్‌ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. దీక్ష విరమించాలని అందరి తరఫున మోతీలాల్‌కు తాము విజ్ఞప్తి చేశామని, కానీ, లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం దిగివచ్చే వరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన తమతో చెప్పారని హరీశ్‌ రావు వెల్లడించారు.

Tags:    

Similar News