పెద్ద అంబర్ పేట వద్ద బస్సు బోల్తా

మరో నాలుగు బస్సులపై కేసులు

Update: 2025-10-25 10:53 GMT

పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ వద్ద ట్రావెల్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. కర్నూలు వద్ద ట్రావెల్ బస్సు ప్రమాదంలో 20మంది చనిపోయిన తర్వాత జరిగిన ఈ ఘటనతో పలువురు భయభ్రాంతులకు గురయ్యారు. మియాపూర్ నుంచి గుంటూరు వైపు వెళుతున్న ట్రావెల్ బస్సు పెద్ద అంబర్ పేట జంక్షన్ చేరుకోగానే అదుపు తప్పి రెయిలింగ్ ను ఢీ కొట్టింది. దీంతో రోడ్డు పక్కన పడిపోయింది. ఓఆర్ ఆర్ దిగుతూ మూల మలుపు వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో 20 మంది ప్రయాణిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గాయాలకు గురైనవారిని కంచన్ బాగ్ డిఆర్డివో, హాయత్ నగర్ ఆస్పత్రుల్లో చేర్చారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. న్యూ గో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదానికి గురికావడం సంచలనమైంది.

అప్రమత్తమైన రవాణాశాఖ

మరో వైపు కర్నూలు ప్రమాదంతో రవాణాశాఖ అప్రమత్తమైంది. నిబంధనలను ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులను అధికారులు సీజ్ చేస్తున్నారు. ఎల్బినగర్ చింతకుంటవద్ద ప్రయివేట్ ట్రావెల్ బస్సును ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. రాజేంద్రనగర్ గగన్ పహాడ్ వద్ద ఆర్టీఏ సోదాలు చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన మరో నాలుగు బస్సులపై కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News