రాష్ట్ర చిహ్నం రగడ... బీఆర్ఎస్ నేతలపై కేసులు

తెలంగాణ అధికారిక రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి.

Update: 2024-05-31 16:36 GMT

తెలంగాణ అధికారిక రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై రాష్ట్రంలో నిరసన వ్యక్తమవుతోంది. చారిత్రక చిహ్నాలను తొలగించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబడుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చార్మినార్, వరంగల్ కోట వద్ద ఆందోళనలు చేపట్టింది. దీంతో నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులపై శుక్రవారం కేసులు నమోదయ్యాయి.

వరంగల్ కోటలో మీడియా సమావేశం నిర్వహించి, నిరసన తెలిపిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఖమ్మం- వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, మాజీ కుడా చైర్మన్ యాదవరెడ్డి ఇతర, బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గురువారం చార్మినార్ వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, పొన్నాల లక్ష్మయ్య, పద్మారావు గౌడ్, మాగంటి గోపినాథ్ మరియు ఇతర నాయకుల మీద సెక్షన్ 188 కింద చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసులపై స్పందించిన బీఆర్ఎస్ పార్టీ... ఇలాంటి చిల్లర కేసులకి భయపడేది లేదని తేల్చి చెప్పింది. తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి, చారిత్రక వైభవానికి విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని ట్విట్టర్ వేదికగా హెచ్చరించింది. 

Tags:    

Similar News