రేవంత్ సర్కార్ కి బడ్జెట్ పెట్టే చాన్స్ వస్తుందా?

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ ప్రభుత్వానికి 2024-2025 బడ్జెట్‌ రూపకల్పన కత్తి మీద సాముగా మారింది..

Update: 2024-01-20 02:00 GMT
Budget book image

అటు పార్లమెంటు ఎన్నికలు ఇటు బడ్జెట్.. ఏది ముందు ఏది వెనుక అనే దానిపై తెలంగాణలో తర్జన భర్జన సాగుతోంది. మరోవైపు సాధ్యమైనంత తొందరగా వచ్చే ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ను తయారు చేసే పనిలో పడ్డారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ ప్రభుత్వానికి 2024-2025 బడ్జెట్‌ రూపకల్పన కత్తి మీద సాముగా మారింది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా... వాస్తవ బడ్జెట్‌పై క‌స‌ర‌త్తు చేస్తున్న రేవంత్ సర్కార్‌... మరోవైపు ఆదాయ వనరులపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా అదనపు రాబడులపై దృష్టిపెడుతూనే... పెండింగ్ బకాయిల లిస్ట్‌ను సిద్ధం చేస్తోంది. ఆర్ధిక శాఖ ఈనెల 27వరకు అన్ని శాఖల అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఇప్పుడున్న పథకాలు, వాటి నిర్వహణ, కావాల్సిన నిధులు వంటి అనేక విషయాలపై సమాచారాన్ని రాబడుతోంది.

వాస్తవ బడ్జెట్ సాధ్యమేనా..

రేవంత్ స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చి... నెల‌రోజులు గడిచింది. అధికారికంగా ప‌రిపాల‌న‌పై ప‌ట్టుపెంచుకునే దిశ‌గా అడ‌గులు వేస్తూనే... మ‌రోవైపు వాస్తవ బ‌డ్జెట్ రూప‌క‌ల్పన‌పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈనేపథ్యంలో ఈ కసరత్తుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక స‌రిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం... అందుకు అన‌ుగుణంగా బ‌డ్జెట్ రూపొందించ‌డంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. బ‌డ్జెట్ క‌స‌ర‌త్తులో వేగం పెంచింది.

ఆర్ధిక క్రమశిక్షణకు పెద్దపీట..

ప్రభుత్వం ఆర్థిక క్రమ‌శిక్షణ పాటించ‌క‌పోవ‌డంతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింద‌ని రేవంత్ రెడ్డి సర్కార్‌ ఆరోపిస్తోంది. అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ప్రజ‌ల‌కు చెప్పేందుకు శ్వేతపత్రం విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం బ‌డ్జెట్ రూప‌క‌ల్పన క‌స‌ర‌త్తు ప్రారంభించింది. అన్ని శాఖ‌ల వారీగా లెక్కలు తీస్తోంది. ఆదాయ వ‌న‌రుల సమీకరణపై దృష్టి సారించింది. శాఖలవారీగా ప్రభుత్వానికి రావాల్సిన పెండింగ్ బకాయిలపై ఫోకస్‌ పెట్టింది సర్కార్‌.

గత ఏడాది బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లు..

2023-2024 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ రూ. 2,90,396 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్య‌యం రూ. 2,11,685 కోట్లు, క్యాపిట‌ల్ వ్య‌యం రూ. 37,525 కోట్లు. 2022-23 నాటికంటే ఇది 23 శాతం ఎక్కువ. మరి ఈసారి ఎలా ఉండాలనే దానిపై కసరత్తు ముమ్మరమైంది. గత ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు...భూముల అమ్మకం చేపట్టింది. దీనిద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం ఎంత‌..? ఇప్పటివరకు ఎన్ని బకాయిలు ఉన్నాయనే లెక్కలు తీస్తున్నారు. జాయింట్ వెంచ‌ర్, రాయ‌ల్టీలో బకాయిల‌పై ఫోకస్‌ చేసింది సర్కార్‌. పరిశ్రమల శాఖ పరిధిలోని జాయింట్ వెంచర్స్ నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ వనరుల గురించి ఇప్పటికే లెక్కలు తీసుకుంది. ప్రభుత్వానికి 955 కోట్లు రావాల్సి ఉండగా... 430 కోట్లు వచ్చాయని గుర్తించారు. మిగతా 525 కోట్ల బకాయిలు రాబట్టేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకువెళ్లనున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతీపైసాను సమీకరించే బాధ్యతను ఆయా శాఖల అధికారులకు అప్పగించింది ప్రభుత్వం.

పెండింగ్‌లో ఉన్న భూముల క్రమ‌బ‌ద్ధీక‌ర‌ణ‌ అంశాన్ని ఆదాయ వ‌న‌రుగా మార్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. త్వర‌లోనే LRS, BRSపై నిర్ణయం తీసుకోవ‌డం ద్వారా ప్రజ‌ల‌కు కొంత స్వాంత‌న చేకూర్చడంతో పాటు ఖ‌జానాకు ఆదాయం పెంచుకోవాల‌ని భావిస్తుంది. రాయల్టీపై రావాల్సిన ఆదాయాన్ని వ‌సూల్‌ చేయ‌డం కోసం అవ‌సర‌మైన‌ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మైనింగ్ శాఖ‌ను ఆదేశించింది. రాబోయే రోజుల్లో ఆరు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావాలంటే భారీగా నిధులు కావాలి. దీంతో ఆదాయ వ‌న‌రుల వేట‌లో ప‌డింది.

మోడల్ కోడ్ అమల్లోకి వస్తే...

2024 ఎన్నికల ఏడాది. పార్లమెంటు ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలో జరుగుతాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఇవ్వొచ్చు. కనీసం 40 రోజుల ముందు వస్తుందని అంచనా. అంటే ఫిబ్రవరిలోనే అది వస్తే కొత్త పథకాలను ప్రకటించే వీలుండదు. బడ్జెట్ అంటే ఏవో కొన్ని పథకాలను ప్రకటించాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ తప్ప మరో మార్గం ఉండదు. గత ఏడాది బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మూడు నుంచి జరిగాయి. ఆ తర్వాత మూడు రోజులకు అంటే ఫిబ్రవరి 6న ఆనాటి మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాలు ఆలస్యమైతే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల సాధ్యమైనంత తొందరగా బడ్జెట్ కసరత్తు పూర్తి చేసే పనిలో రేవంత్ ప్రభుత్వం ఉంది. అంతా సవ్యంగా సాగితే ఆర్ధిక మంత్రిత్వ శాఖను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తొలిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వారవుతారు.

Tags:    

Similar News