ఢిల్లీని తాకిన జీవన్ రెడ్డి సెగ... మంత్రివర్గంలో చోటు!!

జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించడంపై పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అలకబూనారు.

Update: 2024-06-26 08:37 GMT

జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించడంపై పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అలకబూనారు. పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు ఆయనను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆయన్ని శాంతింపజేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అత్యవసర సమావేశం కోసం ఆయనను ఢిల్లీకి పిలిపించారు.

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కు జీవన్‌రెడ్డిని ఢిల్లీకి తీసుకెళ్లే బాధ్యతను అప్పగించారు. తనకు తెలియకుండా తన రాజకీయ ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంపై జీవన్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు 40 ఏళ్లుగా పార్టీలో పనిచేసిన తనకి మాటమాత్రం చెప్పకుండా సంజయ్ ని పార్టీలో చేర్చుకోవడం అవమానంగా భావించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

పార్టీ అధిష్టానం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులను రంగంలోకి దించి సర్దిచెప్పించే ప్రయత్నం చేసింది. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ కూడా జీవన్‌ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినా ఫలితం లేకపోయింది. తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన... రాజీనామా లేఖ అందించేందుకు శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నట్లు సమాచారం. తొలుత కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసే ఆలోచన చేసినా.. ఆ తర్వాత పార్టీలోనే కొనసాగుతానని మీడియాకు వెల్లడించారు. 

జీవన్‌ రెడ్డికి మంత్రి పదవి..?

త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో జీవన్‌ రెడ్డిని శాంతిపజేసేందుకు ఆయన్ని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం లేకపోలేదు. 40 మంది సభ్యుల కౌన్సిల్‌లో అధికార కాంగ్రెస్‌కు కేవలం నలుగురు ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒక్కరికి కూడా తొలి కేబినెట్‌ లో చోటు దక్కకపోవడం గమనార్హం. ఉన్న నలుగురిలో జీవన్‌ రెడ్డి సీనియర్ నేత. దీంతో జరుగుతున్న పరిణామాల రీత్యా ఆయనని రెండవ క్యాబినెట్ కి పరిశీలించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా, మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. 

Tags:    

Similar News