Chandrababu and Telangana|తెలంగాణపై చంద్రబాబు కీలక నిర్ణయం ?

పార్టీకి తెలంగాణలో పూర్వవైభవం తీసుకురావాలన్నది చంద్రబాబుఆలోచన. అయితే అదిఎలాగ తీసుకురావాలన్న విషయంలోనే అయోమయం ఉంది.

Update: 2024-12-29 10:30 GMT
TDP President Chandrababu

తెలంగాణా రాజకీయాలకు సంబంధించి చంద్రబాబునాయుడు కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఈమధ్యనే రాజకీయ వ్యూహకర్తలు ప్రశాంత్ కిషోర్( Political Strategist Prasanth Kishore), రాబిన్ సింగ్(Robin Singh) తో చంద్రబాబు(Chandrababu) ప్రత్యేకంగా భేటీ అయినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. పార్టీకి తెలంగాణాలో పూర్వవైభవం తీసుకురావాలన్నది చంద్రబాబుఆలోచన. అయితే అదిఎలాగ తీసుకురావాలన్న విషయంలోనే అయోమయం ఉంది. ఎందుకంటే ఇపుడు పార్టీ తెలంగా(Telangana TDP)ణాలో పూర్తిగా నేలమట్టమైపోయింది. ఏదో ఉందంటే ఉందంతే. పార్టీ ఉనికి ఎక్కువగా లెటర్ హెడ్లకు మాత్రమే పరిమితమయ్యుంది. 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చింది కాబట్టి పార్టీగురించి తెలంగాణాలో కూడా చర్చించుకుంటున్నారు. కాబట్టి ఏపీలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని పార్టీని తెలంగాణాలో మళ్ళీ బలోపేతం చేయాలన్నది చంద్రబాబు ఆలోచన.

అయోమయం ఎందుకు ?

చంద్రబాబుకు అంటూ సొంతంగా ఒక వ్యూహం అంటు లేదు. ఎందుకంటే ఓటుకునోటు దెబ్బకు తెలంగాణాను వదిలేసి విజయవాడకు పారిపోయారు. అప్పటినుండి పార్టీ అనాదగా మారిపోయింది. పార్టీని చంద్రబాబు దాదాపు పదేళ్ళు గాలికి వదిలేశారు. రాజకీయంగా పుంజుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నా కేసీఆర్ దెబ్బకు రివర్సవుతుందేమో అన్న భయం చంద్రబాబులో కనబడింది. దాని కారణంగానే తెలంగాణాపైన పెద్దగా దృష్టిపెట్టలేదు. ఒక పార్టీకి పదేళ్ళపాటు సరైన దిశానిర్దేశంలేకపోతే నాయకత్వం ఎలాగ డెవలప్ అవుతుంది ? పార్టీ బతికి ఎలాగ బట్టకడుతుంది ? ఒకసారి ఎన్నికల్లో పోటీచేయాలని అంటారు ? వెంటనే పోటీచేయటంలేదని ప్రకటిస్తారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు చివరివరకు చెప్పిన చంద్రబాబు చివరినిముషంలో రూటుమార్చేశారు. అందుకనే అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరింది. పార్టీని క్షేత్రస్ధాయి నుండి బలోపేతం చేయటంకోసమే ఏరికోరి కాసానికి చంద్రబాబు పగ్గాలు అప్పగించారు.

కాసాని కూడా ఉత్సాహంగా రాష్ట్రమంతా పర్యటించి కాస్త జవసత్వాలు నింపారు. తీరా ఎన్నికల సమయానికి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైలులో ఉండాల్సొచ్చింది. అక్కడికి వెళ్ళి కాసాని భేటీ అయ్యారు. ఇద్దరి మధ్యా ఏమి చర్చలు జరిగాయో తెలీదు కాని ఎన్నికల్లో పార్టీ పోటీచేయటంలేదని చంద్రబాబు చెప్పటంతో కాసాని పార్టీని వదిలేశారు. ఏదో అదృష్టంకొద్ది ఏపీలో అధికారంలోకి వచ్చేశారు. ఆ పరిస్ధితి తెలంగాణాలో తక్కువ. ఎందుకంటే ఏపీలో అయితే చంద్రబాబు లేకపోతే జగన్ మాత్రమే పోటీలో ఉంటారు. కానీ తెలంగాణాలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉన్నాయి. టీడీపీ ఒంటరిగా పోటీచేసి నిలదొక్కుకోవాలంటే చాలా కష్టమనే చెప్పాలి. పైగా చంద్రబాబును నమ్మటం కూడా కష్టమనే ప్రచారం ఉండనే ఉంది. ఏ ఎన్నికకు ఏ పార్టీతో, ఏ కూటమితో పొత్తంటారో ఎవరూ ఊహించలేరు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణాలో పార్టీ ప్రస్తుత పరిస్ధితికి చంద్రబాబు వైఖరే కారణమనాలి. ఓటుకునోటు కేసులో హైదరాబాదును వదలకుండా ఇక్కడే ఉండే కేసీఆర్ తో ఫైట్ చేసుంటే ఈ పాటికి పార్టీ కథ ఇంకోలాగుండేదనటంలో సందేహంలేదు.

బలోపేతంచేయటంలో భాగంగా ముందుగా 119 నియోజకవర్గాల్లోను పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గ్రేటర్ హైదరాబాదుతో పాటు అన్నీజిల్లాల్లోను సభ్యత్వనమోదు జరుగుతోంది. ఇప్పటికి ఎంతవరకు సభ్యత్వాలు అయ్యాయో స్పష్టంగా ఎవరికీ తెలీదు. సభ్యత్వాలనమోదు పూర్తవ్వగానే పార్టీబలోపేతంపై ఒకఅంచనాకు రావచ్చన్నది చంద్రబాబు ఆలోచన. ఎందుకంటే పార్టీ నుండి నేతలు చాలామంది వెళ్ళిపోయినా చాలా నియోజకవర్గాల్లో క్యాడర్ మాత్రం అలాగే ఉన్నారని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. పార్టీవర్గాల అంచనా ప్రకారం ప్రతినియోజకవర్గంలో సగటున 5 వేలమందికి తక్కువ కాకుండా ఓటర్లున్నారు. అందుకనే ముందుగా సభ్యత్వాన్ని పూర్తిచేస్తేకాని పార్టీ క్యాడర్ స్ట్రెంగ్త్ ఎంతన్న విషయంలో క్లారిటిరాదు. తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీ నేతలను పోటీచేయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అయితే ఏపీలో బీజేపీ, జనసేనతో ఉన్న పొత్తు తెలంగాణా విషయంలో క్లారిటిలేదు.

తెలంగాణాలో పొత్తులపైన కూడా క్లారిటి వచ్చేస్తే అప్పుడు పోటీచేసే విషయమై స్పష్టమైన అంచనా వచ్చేస్తుంది. అయితే ఒంటరిపోటీకి దిగేట్లుగా ఇప్పటికైతే ప్లాన్ చేస్తున్నారు. అందుకనే సభ్యత్వ నమోదు, నియోజకవర్గాల వారీగా సర్వే చేయించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో బాగంగానే రాజకీయ వ్యూహకర్తలు ప్రశాంత్ కిషోర్, రాబిన్ సింగ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారని సమాచారం. ఈ భేటీలో తెలంగాణాలో పార్టీ బలోపేతంమీదే చర్చించారని పార్టీనేతలు చెబుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోని చాలామంది కీలక నేతలు టీడీపీ నుండి వలసవెళ్ళిన వాళ్ళే అన్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి(Revanth) కూడా ఒకపుడు టీడీపీలో చాలా యాక్టివ్ గా ఉన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

పార్టీని బలోపేతంచేయటంలో భాగంగా ఘర్ వాపసీపై పార్టీ అధినేత దృష్టిపెట్టారు. పార్టీని బలోపేతంచేసేందుకు ఇతరపార్టీల్లోని నేతలందరు తిరిగి టీడీపీలోకి రావాలని ఆమధ్య చంద్రబాబు పిలుపిచ్చారు. దానికి స్పందనగా వేర్వేరు సందర్భాల్లో మాజీమంత్రి చేమకూర మల్లారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, తీగల కృష్ణారెడ్డి, బాబూమోహన్, అరెకూపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు మాగంటిగోపి, ప్రకాష్ గౌడ్ లాంటి అనేకమంది సీనియర్ నేతలు చంద్రబాబుతో వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీలో వీళ్ళంతా ఏమి మాట్లాడారు ? చంద్రబాబు వీళ్ళకు ఏమి హామీలిచ్చారన్న విషయం ఎవరికీ తెలీదు. ఏదేమైనా తెలంగాణాలో పార్టీ యాక్టివిటీస్ గనుక మొదలైతే ఇతర పార్టీల నుండి మళ్ళీ టీడీపీలోకి వలసలు మొదలవుతాయని తమ్ముళ్ళు ఆశిస్తున్నారు.

రాజకీయ వ్యూహకర్తలతో చంద్రబాబు భేటీలో తెలంగాణా వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గాల్లో సర్వేలు చేయించాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. టీడీపీ మళ్ళీ యాక్టివ్ అయితే జనాలు ఏ విధంగా ఆధరిస్తారనే విషయంపైన ప్రధానంగా సర్వేలో దృష్టిపెడుతున్నట్లు తమ్ముళ్ళ సమాచారం. పొత్తుల విషయంలో క్లారిటి రావటం, సభ్యత్వనమోదు పూర్తయితే తర్వాత స్ధానికఎన్నికల్లో పోటీచేసే విషయమై గట్టి నిర్ణయం తీసుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. పై రెండు పాయింట్లను వీలైనంత తొందరలోనే పూర్తిచేసి ఎన్నికల్లో పాల్గొనే విషయంలో తమ్ముళ్ళని సమాయత్తం చేయబోతున్నారు. సైడ్ బై సైడ్ ఇతర పార్టీల నుండి మాజీ తమ్ముళ్ళతో పాటు సీనియర్ నేతలను ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపాలని చంద్రబాబు డిసైడ్ చేసినట్లు సమాచారం. మొత్తంమీద తొందరలోనే తమ్ముళ్ళు మళ్ళీ యాక్టివ్ అవటం ఖాయమనే అనిపిస్తోంది. చంద్రబాబు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

Tags:    

Similar News