కాంగ్రెస్ గూటికి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఢిల్లీలో రేవంత్ రెడ్డి సమక్షంలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Update: 2024-06-28 10:12 GMT

బీఆర్ఎస్ పార్టీలో మరో వికెట్ పడింది. ఫిరాయింపులను కట్టడి చేసేందుకు అధినేత కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న వేళ ఇంకొక ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య హస్తం గూటికి చేరారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి ఆయనకి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

కాంగ్రెస్ తోనే కాలె యాదయ్య రాజకీయ అరంగేట్రం 

కాలె యాదయ్య తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రారంభించారు. తొలినాళ్లలో ఎంపీపీ, జెడ్పీటీసీగాపని చేశారు. 2009లో చేవెళ్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోరాని సాయన్న రత్నం చేతిలో ఓటమిపాలయ్యారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కోరాని సాయన్న రత్నంపై 781 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 33 వేల 552 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి భరత్ పై కేవలం 268 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

అసెంబ్లీలో పెరిగిన కాంగ్రెస్ బలం..

తెలంగాణలో పార్టీని మరింత బలపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచింది. పార్లమెంటు ఎన్నికల హడావుడితో చేరికలపై ఫోకస్ పెట్టని హస్తం పార్టీ... సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆపరేషన్ ఆకర్ష్ కి తెరలేపినట్టు స్పష్టమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముందుగా మాజీ తెలంగాణ స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన తర్వాత జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కూడా హస్తం తీర్ధం పుచ్చుకున్నారు. నేడు చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎంట్రీతో అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యాబలం మరింత పెరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 71కి చేరుకుంది. 

Tags:    

Similar News