బీసీ రిజర్వేషన్లపై కవిత ఫోకస్
బీసీ నాయకులను జాగృతిలో చేర్చుకున్న కవిత.;
బీసీల రిజర్వేషన్లపై పోరాడటానికి కల్వకుంట్ల కవిత సిద్ధమవుతున్నారు. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ వాటిని ఆచరణలో పెడుతున్నారు. ఇందుులో భాగంగానే పలువురు బీసీ నాయకులను శనివారం ఆమె జాగృతిలోకి కండువాలు కప్పి ఆహ్వానించారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో బీసీ నాయకులు పలువురు జాగృతిలో చేరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కవిత చేస్తున్న కృషిని తాము గుర్తించామని, ఆ పోరాటంలో ఆమెతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నామని, అందుకే జాగృతిలో చేరామని వారు పేర్కొన్నారు. 2001 నుంచి కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచిన జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ గోపు సదానందం, సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్, అరె కటిక సంఘం సురేందర్ తమ అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు.
కంటితుడుపు చర్యగానే బిల్లులు
అనంతరం వారితో కవిత సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస కుట్రలు పన్నుతోందని విమర్శించారు కవిత. అదే జరిగితే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ విషయంలో తాము వెనకడుగు వేసేది లేదని ఆమె అన్నారు.తెలంగాణ జాగృతి, బీసీ సమాజం ఒత్తిడికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్ లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లులు పాస్ చేసిందని కవిత పేర్కొన్నారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
అయితే వాటికి ఇప్పటి వరకు రాష్ట్రపతి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కంటితుడుపు చర్యలు చేపడుతుంది తప్పితే, రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచన వారికి లేదంటూ ఆరోపించారు. అందుకే ప్రదాని దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామన్న మాటను కూడా తప్పిందని గుర్తు చేశారు. కేంద్రం వద్ద బిల్లులు పెండింగ్ లో ఉండగానే రాష్ట్ర కేబినెట్ రిజర్వేషన్ల పెంపునకు చట్ట సవరణ చేస్తున్నట్టుగా ప్రకటించి ఆ ప్రతిపాదనలు గవర్నర్ కు పంపిందన్నారు.
ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి
అటు కేంద్రం, ఇటు గవర్నర్ ను కలిసి రిజర్వేషన్లు సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదని, బిల్లు ఆర్డినెన్స్ పేరుతో తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. బీసీలను మభ్యపెట్టేందుకు ఇటీవల అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి చట్ట సవరణ పేరుతో మళ్లీ మోసపూరిత రాజకీయాలకు తెరతీసిందన్నారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.