మేడ్చల్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

32వేల లీటర్ల ముడిసరుకు, 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.;

Update: 2025-09-06 10:35 GMT

మేడ్చల్‌లో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుత్బుల్లాపూర్‌లో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేసిన దాడుల్లో ఈ డ్రగ్స్ తయారీ యూనిట్ గుట్టు రట్టయింది. ఈ దాడుల్లో పోలీసులు 32వేల లీటర్ల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మిథైలెనెడియాక్సీ మెథాం ఫెటమైన్ వంటి ముడి పదార్థాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ఫ్యాక్టరీని బేస్‌గా మార్చుకుని పెద్దమొత్తంలో డ్రగ్స్‌ను తయారు చేస్తున్నారని, వాటిని దేశంలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ తయారు చేసిన డ్రగ్స్‌ను మోలీ, ఎక్స్‌టీసీ పేర్లతో సరఫరా చేస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ డ్రగ్స్‌ అంశంపై స్థానిక పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు.

వాటి విలువ ఎంతంటే..!

అయితే ఈ ఫ్యాక్టరీలో పోలీసులు స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ ఎంత అనేది మాత్రం ఇంకా అధికారులు వెల్లడించలేదు. కానీ వీటి విలువ అంశంలో అనేక ప్రచారాలు మొదలయ్యాయి. కొందరు రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అంటే మరికొందరు రూ.5 కోట్లకు మించి లేదని, ముడిసరుకు ధర మాత్రం చాలా అధికంగానే ఉండొచ్చని అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకు వాటి విలువపై ఎటువంటి అంచనాను అధికారికంగా ప్రకటించలేదు.

విదేశాలకు ఇక్కడి నుంచే

మేడ్చల్‌లోని ఫ్యాక్టరీలో తయారు చేసిన డ్రగ్స్‌ను కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాలకు కూడా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సరఫరాకు నిందితులు ఏ మార్గం ఎంచుకున్నారు? విదేశాలకు ఎలా తరలిస్తున్నారు? దేశంలో వీరికి ఇంకా ఎన్నిక కేంద్రాలు ఉన్నాయి? వంటి అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News