‘నాపై ఆరోపణలను కవిత విజ్ఞతకే వదిలేస్తున్నా’
జరుగుతున్న ప్రచారాన్నే కవిత మరోసారి చెప్పారన్న హరీష్ రావు.;
కాళేశ్వరంలో అవినీతిపై కవిత చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు బదులిచ్చారు. తానేంటో అందరికీ తెలుసని, తనపై ఆరోపణలను చేసిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని హరీష్ రావు అన్నారు. కాగా కవిత చేసిన ఆరోపణలను ఆయన చాలా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇతర పార్టీల నేతలు తనపై అనేక ఆరోపణలు చేస్తున్నారని, వాటినే కవిత చెప్పారని హరీష్ అన్నారు. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న హరీష్ రావు.. విమానాశ్రయం దగ్గర కవిత ఆరోపణలపై స్పందించారు.
కావాలనే దుష్ప్రచారం..
‘‘నాపై కొన్ని పార్టీల నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్నే కవిత మరోసారి మాట్లాడారు. నాపై చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే విలేస్తున్నా. నా జీవితం తెరిచిన పుస్తకం. తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏమిటో అందరికీ తెలుసు. క్రమశిక్షణ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తగా కేసీఆర్ నాయకత్వంలో 25ఏళ్లుగా పనిచేశా. తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. ఎవరో అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన అవి నిజాలు అయిపోవు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తాం. ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించి కలిసి కట్టుగా ముందుకు సాగుతాం’’ అని హరీష్ చెప్పారు.
డబ్బు తప్ప ఏం పట్టదు: కవిత
ఇదిలా ఉంటే హరీష్ రావు, జోగినపల్లి సంతోష్‌పై కవిత చేసిన ఆరోపణలు బీఆర్ఎస్‌లో తీవ్ర గందరగోళం సృష్టించాయి. కాళేశ్వరం నిర్మాణంలో వారిద్దరూ కలిసే అవినీతి చేశారని అన్నారు కవిత. సంతోష్ అనే వ్యక్తి డబ్బు కోసం తప్పితే ఇంకేమీ పట్టించుకోరన్నారు. వారిద్దరూ కూడా బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. అందుకే దాదాపు 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు తన సొంత ఖర్చులతో ఎన్నికల సమయంలో మద్దతుగా నిలిచారని విమర్శించారు. వారి దాష్టీకం తట్టుకోలేకే పలువురు కీలక నేతు పార్టీ నుంచి వెళ్లిపోయారని కూడా కవిత ఆరోపణలు చేశారు. కవిత చేసిన ఆరోపణల ఫలితంగా ఆమెను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారు. కాగా అనంతరం పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. ‘‘వాస్తవాలు మాట్లాడినందుకు ఇది నేను చెల్లించే మూల్యం అనుకుంటే మరో వందసార్లు దీనిని చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అని కవిత అన్నారు.