HCA అక్రమాల కేసులో కీలక పరిణామం..
20 రోజుల తర్వాత పరారీలో ఉన్న జనరల్ సెక్రటరీ దేవరాజ్ అరెస్ట్. వెలుగులోకి మరో భారీ స్కాం.;
హెచ్‌సీఏ అక్రమాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఒకవైపు ముగ్గురు నిందితులకు బెయిల్ లభించింది. మరోవైపు దాదాపు 20 రోజులు గాలిస్తున్న హెచ్‌సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్‌ను సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌సీఏ అవినీతి ఆరోపణల కేసులో దేవరాజ్ ఏ2గా ఉన్నారు. సీఐడీ కేసు నమోదు చేసినప్పటి నుంచి దేవరాజ్ పరారీలో ఉన్నారు. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ శాఖ సిఫార్సు మేరకు సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఈకేసులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావును సీఐడీ ఏ1గా చేర్చింది. ఈ కేసులో దేవరాజ్‌ను ఏ2గా చేర్చింది. కాగా ఆయన పారారీలో ఉండటంతో అప్పటి నుంచి సీఐడీ అధికారులు గాలింపు చర్చలు చేపట్టారు. తాజాగా పక్కా సమాచారం రావడంతో శుక్రవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
రూ.4 కోట్ల దారి మళ్లింపు
అయితే శుక్రవారం.. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌సీఏలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. సమ్మర్ క్యాంపుల పేరుతో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అండ్ కో అంతా కలిసి రూ.4కోట్లు దారి మళ్లించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను కూడా సీఐడీ అధికారులు సేకరించినట్లు సమాచారం. గతేడాది సమ్మర్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 కేంద్రాల్లో హెచ్‌సీఏ.. సమ్మర్ క్యాంపులను నిర్వహించింది. ప్రతీ క్యాంపులో 100 మంది చొప్పున మొత్తం అన్ని క్యాంపుల్లో కలిపి 2500 మందికిపైగా ఆటగాళ్లకు కోచింగ్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలను చూపింది హెచ్‌సీఏ. ఒక్కో క్యాంప్‌పై రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు చూపి.. రూ.4 కోట్ల రూపాయలు జగన్‌మోహన్‌రావు కాజేశారు. క్యాంప్‌కి హాజరైన విద్యార్థులకు క్రికెట్ కిట్స్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించారు. క్యాంప్‌లు నిర్వహించిన కేంద్రాల్లో సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కో క్యాంప్‌లో లక్ష కూడా ఖర్చు చేయలేదని సీఐడీ ఆధారాలు సేకరించింది.