సినీ దిగ్గజం కోటా శ్రీనివాసరావు కన్నుమూత
ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు కొద్ది సేపటి కిందట కన్నుమూశారు.;
By : The Federal
Update: 2025-07-13 02:00 GMT
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన జూలై 13 ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని తన ఇంట్లో మరణించారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించిన కోటా శ్రీనివాసరావు 750కు పైగా చిత్రాల్లో నటించారు. కోటా మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది.
విలన్‌గా భయ పెట్టాలన్నా.. కామెడీతో నవ్వించాలన్నా.. ఎమోషన్స్ తో ఏడిపించాలన్నా.. ఆయనకు ఆయనే సాటి. తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కోట శ్రీనివాసరావు 10 జూలై 1947న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, నూజివీడు లో జన్మించారు. ఆయన తండ్రి కోట సీతారామ అనసూయమ్మ, చిన్నతనం నుంచే నటనపై అభిరుచి ఉన్న ఆయన విద్యార్థి దశ నుంచే నాటకాలు వేస్తూ తన ప్రతిభను చాటారు. 1978లో విడుదలైన ప్రేమాభిషేకం సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన కోట ఆఖరి పోరాటం, ప్రతిఘటన వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై జంధ్యాల అహా నా పెళ్లంట సినిమాలో పిసినారి పాత్రలో మెప్పించి మళ్లీ ఆయన వెనకకు తిరిగి చూడాల్సిన అవసరం లేకేండా బిజీ అయ్యారు.
ఆపై బాబు మోహన్ కాంబినేషన్ ఆయనలోని కామెడీ టైమింగ్ అద్భుతాలే సృష్టించిందో, వెంకటేశ్ హీరోగా వచ్చిన గణేశ్ సినిమాలో ఆయన విలనిజంతో నాటి ప్రేక్షకులను వణికించారంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఇడియట్ సినిమాలు కూడా మంచి పేరును తీసుకు వచ్చాయి. ఇదిలాఉంటే.. తెలుగులో ఆయన చివరగా 2023లో విడుదలైన సువర్ణ సుందరి అనే చిత్రంలో కనిపించారు. కాగా కోట శ్రీనివాసరావు తమిళంలో 30కి పైగా చిత్రాల్లో నటించగా హిందీలో 10, కన్నడలో8, మలయాళ, డక్కన్ భాషల్లో ఒక్కో చిత్రంలో నటించారు. అతేగాక ఆయన తెలుగులో అఖిల్ సిసింద్రీ సినిమాలో ఓరి నాయనో, గబ్బర్ సింగ్ సినిమాలో ముందుబాబులం అంటూ రెండు పాటలు సైతం పాడడం విశేషం.
1999లో భారతీయ జనతా పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోట శ్రీనివాసరావు ప్రజాసేవతో మంచి నాయకుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు.