‘పెట్టుబడిదారులూ.. మీ మద్దతు కావాలి’
ఇన్వెస్టర్స్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.;
తెలంగాణ ప్రపంచ నగరాలతో పోటీ పడేలా అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ 10 శాతం సహకారం అందించాలని, ఆ దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని నెవ్వర్ బిఫోర్ అనేలా తీర్చిదిద్దుతున్నామని, పెట్టుబడులు పెట్టేవారికి అన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడించారు. పారిశ్రామిక రంగం అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, రాయితీలు, అనుమతులను మంజూరు చేయడం వంటి సానుకూల వాతావరణం కల్పిస్తామని చెప్పారు. శామీర్‌పేట్ జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ (ICHOR Biologics) కొత్త యూనిట్‌కు ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు.
‘‘రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. ఐటీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఫార్మా, బయో సైన్సెస్‌లతో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులతో ముందుకొచ్చే పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులకు చైనాకు ప్రత్యామ్నాయంగా పారిశ్రామిక రంగం భారత్ వైపు దృష్టి సారించగా, అందుకు అత్యుత్తమ గమ్యస్థానంగా తెలంగాణ ఉండాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నది మా ఆలోచన. 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని నిర్దేశించగా, అందులో తెలంగాణ నుంచి 10 శాతం మేరకు కంట్రిబ్యూట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నిర్దేశిత గడువు నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యంతో పెట్టుకున్నాం’’ అని అన్నారు.
‘‘బల్క్ డ్రగ్స్, వాక్సిన్ల తయారీలో ప్రపంచంలోనే తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే ఇక్కడి పారిశ్రామిక వేత్తల కృషి ఎంతో ఉంది. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని బయపెడుతున్న సమయంలో జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సీన్లు తయారు చేసి దాదాపు వంద దేశాలకు సరఫరా చేసిన సందర్భం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈరోజు దేశంలో 33 శాతం వ్యాక్సీన్లు తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతుండగా, 40 శాతం మేరకు బల్క్ డ్రగ్స్ ఉత్పత్తు చేస్తున్నామంటే ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వారు ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. ఈ మధ్య కాలంలో బయో, ఫార్మసీ రంగంలో కూడా ప్రపంచంలోని అత్యాధునిక విధానాలు అవలంభిస్తున్న పరిశ్రమలను అహ్వానించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. జినోమ్ వ్యాలీ పెట్టుబడుదారులకు స్వాగతం పలుకుతున్నాం. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ప్రోత్సాహకాలను అందిస్తుంది. మీ మద్దతు కావాలి. పెట్టుబడులు పెట్టండి..” అని పిలుపునిచ్చారు.