HCA-SRH వివాదంపై సీఎం సీరియస్

ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బందులకు గురి చేస్తూ ఊరుకోమన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ స్పష్టం చేశారు.;

Update: 2025-03-31 12:36 GMT

హైదరాబాద్ క్రికెట్ సంఘం(HCA), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య కొన్ని రోజులుగా తీవ్ర వివాదం కొనసాగుతోంది. కాంప్లిమెంటరీ పాస్‌ల కోసం హెస్‌సీఏ ఉన్నతాధికారులు కొందరు ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీని బెదిరిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ఈ కారణంగానే ఎస్‌ఆర్‌హెచ్ తమ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియం‌ను విడిచిపెట్టొచ్చన్న వాదన వినిపిస్తోంది. తాజాగా ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలను తన కార్యాలయం ద్వారా సేకరించారు. అంతేకాకుండా ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే పాసుల విషయంలో హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య జరుగుతున్న వివాదం తారాస్థాయికి చేరుతుండటంతోనే సీఎం జోక్యం చేరసుకున్నారని, ఈ అంశాన్ని ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంఛైజీ యాజమన్యం ఆయన దృష్టికి తీసుకెళ్లిందని తెలుస్తోంది.

అయితే ఐపీఎస్‌ 2025 ఒప్పందం ప్రకారం 10శాతం టికెట్లు హెచ్‌సీఏకు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా 50 టికెట్ల సామర్థ్యం ఉన్న కార్పొరేట్ బాక్స్‌‌ను హెచ్‌సీఏకు కేటాయించారు. కానీ ఈ ఏడాది ఆ బాక్స్ సామర్థ్యం 30కి తగ్గింది. దీంతో తమకు అదనంగా మరో 20 టికెట్లు ఇవ్వాలని హెచ్‌సీఏ డిమాండ్ చేసింది. దీనిపై చర్చించాలని ఎస్‌ఆర్‌హెచ్ ప్రతినిధులు సూచించారు. దీంతో ఒక మ్యాచ్ సందర్భంగా ఆ హెచ్‌సీఏ ప్రతినిధులు తమ కార్పొరేట్ బాక్స్‌కు తాళం వేశారు. తమకు రావాల్సిన అదనపు 20 టికెట్లు ఇస్తేనే తాళం తీస్తామని హెచ్‌సీఏ ప్రతినిధులు చెప్పారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఆర్‌హెచ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్.. హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావుకు లేఖ రాసినట్లు సమాచారం. ఈ లేఖలో గత రెండేళ్లుగా హెచ్‌సీఏ వేధింపులు ఎక్కువయ్యాయని, తాము ఉప్పల్ స్టేడియంలో ఆడటం ఇష్టం లేనట్లు హెచ్‌సీఏ ప్రవర్తిస్తోందని, ఇలానే కొనసాగితే ఇదే విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో చర్చించి మరో హోమ్ గ్రౌండ్ చూసుకోవాల్సి రావొచ్చని పేర్కొన్నారు.

తాజాగా ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ వివాదంపై తన ఆఫీసు అధికారులు ద్వారా పూర్తి వివరాలుస సేకరించారు. పాసుల విషయంలో ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసిందా లేదా? అన్న అంశంపై విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ వివాదంపై పూర్తి నివేదిక అందించాలని విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోమన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలేనని హెచ్‌సీఏ చెప్పింది. వివాదం తీవ్రతరం అవుతన్న క్రమంలో హెచ్‌సీఏ స్పందించింది. తమకు ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి ఎటువంటి అధికారిక ఈమెయిల్ రాలేదని, నెట్టింట జరుగుతున్నదంతా అసత్య ప్రచారమేనని పేర్కొంది. కొందరు గిట్టని వ్యక్తులు హెచ్‌సీఏ ప్రతిష్టకు భంగం కలిగించాలని ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అలాకాని పక్షంలో హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ అధికారిక ఈమెయిల్స్ నుంచి కాకుండా గుర్తు తెలియని ఈమెయిల్స్ ద్వారా ఎందుకు లీకులు ఇస్తున్నట్లని ప్రశ్నించారు. అదే విధంగా ఈ వివాదంపై ఎస్‌ఆర్‌హెచ్ నుంచి కూడా అధికారిక వివరణ ఇవ్వాలని హెచ్‌సీఏ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.

Tags:    

Similar News