హైదరాబాద్ లో కోలివింగ్ హాస్టల్స్ ట్రెండ్
మహిళలు, పురుషులు ఒకే రూం షేర్ చేసుకునే ట్రెండ్ మొదలయింది. ఈ తరహా ‘కోలివింగ్’ పిజిలు వస్తున్నాయి. దీని ప్రత్యేక కథనం;
రిథిమ కౌర్...పంజాబుకు చెందిన రిథిమ కౌర్ నగరంలోని ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తోంది. నెలతిరిగేటప్పటికి జీత, బత్యాలు బాగానే వస్తుంది. ఉద్యోగం తప్ప పొద్దునలేచి టీ పెట్టుకోవటం దగ్గర నుండి రాత్రి వంటచేసుకోవటం వరకు ఏపనిచేయాలన్నా విసుగే. అందుకని పేయింగ్ గెస్ట్(పీజీ)గా ఉంటోంది. అయితే పీజీలో ఒంటరిగా ఉండాలంటే మహాబోరు ఫీలవుతోంది. ఆ సమయంలోనే పంజాబుకే చెందిన కున్వర్ సింగ్ పరిచయమయ్యాడు. ఇద్దరు వేర్వేరుగా వేర్వేరు పీజీల్లో ఉంటున్నారు. కంపెనీ వేరే అయినా ఇద్దరి అభిరుచులు దాదాపు ఒకటే అవటంతో ఇద్దరు కలిసి ఉండాలని డిసైడయ్యారు. ఇద్దరికీ వివాహాలు కాలేదు. గచ్చిబౌలిలో ఉన్న ఒక కో లివింగ్ నెస్ట్ లోకి మారిపోయారు. ఆ నెస్ట్ లో ఇద్దరు ఒకేగదిలో ఉంటున్నారు.
శార్వణీ చౌహాన్..ఈమె హర్యానాకు చెందిన యువతి. హైదరాబాదు, హైటెక్ సిటీలోని ఒక ఐటి కంపెనీలో పెద్ద హోదాలోనే పనిచేస్తోంది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఢిల్లీకి చెందిన విక్రమ్ సేథ్ పరిచయమయ్యాడు. విక్రమ్ కూడా పెద్ద కంపెనీలోనే పనిచేస్తున్నాడు. ఇద్దరూ అవివాహితులే కావటం, పెద్ద ఉద్యోగాలు, మంచి జీత, బత్యాలు వస్తుండటంతో కొంతకాలానికి ఇద్దరు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అనుకోవటమే ఆలస్యం తమ లొకాలిటీలోనే ఉండే ఒక కో లివింగ్ లోకి మారిపోయారు. ఇద్దరికీ వివాహాలు కాకపోయినా ఒకే గదిలో కలిసుండాలని డిసైడ్ అయ్యారు.
రిథిమ కౌర్..కున్వర్ సింగ్, శార్వణి చౌహాన్..విక్రమ్ సేథ్ రెండు ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి కో లివింగ్ జంటలు హైదరాబాదులో కొన్ని వందలమంది ఉన్నారు. ఇదంతా ఏమిటంటే అంతర్జాతీయస్ధాయికి నగరాన్ని చేర్చాలన్న పాలకుల ఆరాటంతో వచ్చిపడిన కో లివింగ్(Co-Living) అనే కొత్త తరహా కల్చర్ అనే చెప్పాలి. మనకు బాయ్స్ హాస్టల్స్ లేదా గర్ల్స్ హాస్టల్స్ చాలా కాలంగా తెలుసు. బయట ఎక్కడో గదులు అద్దెకు తీసుకుని అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరికి వాళ్ళుగా కలిసుండటం మనలో చాలామందికి అనుభవమే. కొంతకాలం క్రితం పేయింగ్ గెస్ట్ కల్చర్ అనేది పుట్టుకొచ్చింది. ఇదేమిటంటే ఎవరి ఇంట్లోనో గదిని అద్దెకు తీసుకుని చదువు లేకపోతే ఉద్యోగం కోసం పీజీగా ఉండటం. పీజీ(Paying Guest) అంటే గదిలో దిగిన అమ్మాయి లేకపోతే అబ్బాయికి ఇంటి యజమానే భోజన, వసతి సౌకర్యాలు చూపిస్తారు. నెలకు ఇంతాని అన్నింటికీ కలిపి అద్దె తీసుకుంటాడు.
పైన చెప్పిన విధానాల్లో అభ్యంతరం చెప్పాల్సినవి ఏమీలేవు. అయితే కొంతకాలంగా అంటే సుమారు ఏడెనిమేదుళ్ళుగా మరో కల్చర్ పుట్టుకొచ్చింది. అదే కో లివింగ్ కల్చర్. ఈ పద్దతిలో అమ్మాయి, అబ్బాయి ఇష్టపడితే చాలు ఒకే గదిలో ఇష్టం వచ్చినంత కాలం ఉంటారు. ఇలాంటి కల్చర్ వల్ల మన సొసైటీ డెవలప్ అవుతోందని గర్వపడాలా ? సంతోషించాలా ? లేకపోతే లేనిపోని అనర్ధాలకు దారితీస్తుందని బాధపడాలో కూడా తెలీటంలేదు. ఇలాంటి కో లివింగ్ కల్చర్ కొంతకాలంగా హైదరాబాదులో బాగా పెరిగిపోతోంది. దేశంలోని ఉత్తర-దక్షిణ ప్రాంతాలకు హైదరాబాద్ హబ్ అన్నవిషయం తెలిసిందే. అందుకనే దేశంమొత్తంలోని అన్నీ రాష్ట్రాల నుండి ఉపాధి, ఉద్యోగాలు, ఉన్నత విద్య పేరుతో చాలామంది ముఖ్యంగా యువత హైదరాబాదు(Hyderabad)కు వచ్చేస్తున్నారు.
హైదరాబాదుకు వస్తున్న వారు తమఊర్లలో తల్లి, దండ్రుల దగ్గర ఎలాగుండేవారో తెలీదుకాని పెద్దవాళ్ళకు దూరంగా పెద్ద జీతాలతో అవకాశాలు రావటాన్ని స్వేచ్చ, స్వాతంత్ర్యం వచ్చినట్లుగా ఫీలవుతున్నారు. ఆర్ధికంగా స్వతంత్రం అవటంతో స్వేచ్చకు అవధులు లేకపోతోంది. ముఖ్యంగా పెద్దవాళ్ళ అదుపులేకపోవటంతో కో లివింగ్ కల్చర్ వైపు తొందరగా ఆకర్షితులవుతున్నారు. ఉత్తరాధి రాష్ట్రాల నుండి హైదరాబాదుకు వస్తున్న యువత అంతా కో లివింగ్ పద్దతిలోనే కలిసుంటున్నారని చెప్పటంలేదు. వచ్చేవాళ్ళల్లో కొందరు కో లివింగ్ పద్దతిలో కలిసుండటానికి వెనకాడటంలేదు. ఉత్తరాధివారు హైదరాబాదుకు రావటానికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పటంలేదు. కారణం ఏమిటంటే భాషా సమస్య లేకపోవటమే.
ఇదేవిషయమై బెంగుళూరు(Bangalore)లో టెలికాలర్ కంపెనీలో ఉద్యోగం చేసి హైదరాబాదుకు వచ్చిన హేమంత్ ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు హైదరాబాదు అనేక రకాలుగా చాలా ఫాస్టుగా డెవలప్ అయిపోతోందన్నాడు. తాను బెంగుళూరులో ఉద్యోగం చేసేటపుడు ఒక అమ్మాయితో కో లివింగ్ పద్దతిలోనే ఉన్నట్లు చెప్పాడు. ఈమధ్యనే హైదరాబాదుకు మారిన తాను ఇపుడు కూడా ఉత్తరాధికి చెందిన అమ్మాయితో కో లివింగ్ పద్దతిలోనే కుకట్ పల్లిలో ఉంటున్నట్లు చెప్పాడు. ఇద్దరికీ ఇష్టంఉన్నంతాకలం ఉంటాము కుదరకపోతే నో ప్రాబ్లెమ్ వేరేవాళ్ళని వెతుక్కుంటామని చాలా తేలికగా చెప్పేశాడు.
ఇంకా తనేమంటాడంటే, కో లివింగ్ పద్దతిలో అబ్బాయిలతో కలిసుండటానికి ఇష్డపడే అమ్మాయిల్లో ఎక్కువమంది ఉత్తరాధి వారేనట. ఎందుకంటే హైదరాబాదు, తెలంగాణ అమ్మాయిలెవరూ కో లివింగ్ పద్దతిలో కలిసుండటానికి ఇష్టపడటంలేదని చెప్పాడు. కారణం ఏమిటంటే ఏరోజైనా సడెన్ గా తల్లి, దండ్రులు, లేదా కుటుంబసభ్యులు, బంధువులు లేదా తెలిసిన వాళ్ళు కనబడితే అంతే సంగతులన్నాడు. ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవైపోతుందన్న భయంతోనే అమ్మాయిలు కో లివింగ్ పద్దతికి దూరంగా ఉంటున్నారట. ఉత్తరాధి నుండి హైదరాబాదుకు వచ్చే తల్లి, దండ్రులు లేదా కుటుంబసభ్యులు ముందుగా అమ్మాయిలకు సమాచారం ఇవ్వకుండా వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువన్నాడు. ముందుగా సమాచారం ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చేసమయానికి కో లివింగ్ పార్టనర్ ను బయటకు పంపేస్తారని చెప్పాడు. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంతా మామూలుగానే ఉంటుందన్నాడు. హైదరాబాదులోనే ఉద్యోగంచేస్తున్న గణేష్ కూడా సేమ్ డిటోనే చెప్పాడు. బెంగెళూరులో ఉద్యోగం చేసేటపుడు తాను కో లివింగ్ పద్దతిలో కొంతకాలం అమ్మాయితో కలిసున్నట్లు మొహమాటపడుతు చెప్పాడు. అయితే హైదరాబాదుకు మకాం మార్చేసిన తర్వాత తానే ఒక కో లివింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు కూడా చెప్పాడు.
ఛార్జీలు ఎలాగుంటాయి ?
కో లివింగ్ పద్దతిలో నిర్వాహకులు అబ్బాయిలు, అమ్మాయిల నుండి భారీగానే డబ్బులు వసూలు చేస్తున్నట్లు చెప్పాడు. బెంగుళూరులో అయితే కో లివింగ్ పద్దతిలో అద్దెకు తీసుకునే వాళ్ళు ఏ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు ? వాళ్ళ జీత, బత్యాలు ఎంతని ఓనర్లు తెలుసుకుంటారు. వివరాలు తెలుసుకోవటం కోసం కంపెనీల ఐడీల కార్డులు, మూడునెలల జీతబత్యాల బ్యాంకు స్టేట్మెంట్లు కూడా చూస్తారు. వీటి ఆధారంగానే గదులకు అద్దెలు ఎంత వసూలు చేయాలో, డిపాజిట్లు ఎన్నినెలలు తీసుకోవాలో డిసైడ్ చేస్తారు. హైదరాబాదులో కంపెనీ ఐడీ కార్డులు, బ్యాంకు స్టేట్మెంట్లు అడగకపోయినా ఇస్తున్న బస, వసతి సౌకర్యాలను బట్టి అద్దెలు వసూలు చేస్తున్నారు. లగ్జరీ హోటల్ స్ధాయిలో సౌకర్యాలున్న కో లివింగ్ గదులకు నెలకు ఒక్కోళ్ళనుండి రు. 60 వేలు కూడా వసూలు చేస్తున్నారు. ఇంతటి లగ్జరీ కో లివింగ్ గదులు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, కావూరి హిల్స్ ఏరియాల్లో ఉంటున్నాయి.
లగ్జరీ కో లివింగ్ గదులు అద్దెకు ఇచ్చే యజమాన్యాలు 24 గంటలూ ఇంటర్నెట్, కిచెన్, లాండ్రీ, డాక్టర్ ఆన్ కాల్, డైనింగ్ సౌకర్యాలను కల్పిస్తున్నాయి. 5 స్టార్ హోటల్లో గదులు ఎలాగుంటాయో ఇక్కడి గదులు కూడా అలాగే ఉంటాయి. మామూలు స్ధాయిలో కో లివింగ్ గదులు కావాలని అనుకుంటే నెలకు రు. 15 వేల నుండి మొదలవుతాయి. ఇక్కడ కో లివింగ్ అంటే ఒకే గదిలో అబ్బాయి, అమ్మాయి కలిసుండటమే కాదు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు కూడా కలిసుండవచ్చు.
కో లివింగ్ అంటే నెగిటివ్ ప్రచారం
ఇదే విషయమై ‘లివింగ్ క్వార్టర్స్’ బ్రాండ్ కింద కో లివింగ్ పద్దతిలో అద్దెకు ఇచ్చే సీఎస్ లక్స్యూరియో మేనేజర్ మూనిస్ ఆలి మాట్లాడుతు కో లివింగ్ అంటే నెగిటివ్ గా బాగా ప్రచారం అయిపోయిందన్నాడు. కో లివింగ్ అంటే ఇపుడు జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిజంకాదన్నాడు. కో లివింగ్ అంటే ‘కమ్యూనిటి లివింగ్’ అని అర్ధంచెప్పాడు. 2017లో తమ కంపెనీ మొదటి కో లివింగ్ పద్దతిని గచ్చిబౌలిలో మొదలుపెట్టిందన్నాడు. తమకు హైదరాబాదులోని మాదాపూర్, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో 9 బ్రాంచులున్నట్లు తెలిపాడు. అన్నింటిలో కలిపి 500 గదులున్నట్లు వివరించాడు. అపార్ట్ మెంట్లను అద్దుకు తీసుకుని తాము కో లివింగ్ గదులుగా మార్చుతున్నట్లు వివరించాడు. తమ దగ్గర ఉంటున్న వాళ్ళల్లో ఐటి ఉద్యోగాలు చేసుకుంటున్న యువత నుండి రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న ఎగ్జిక్యూటివులు కూడా ఉన్నారన్నాడు. తమగదుల్లో అబ్బాయిలకు, అమ్మాయిలకు సపరేటుగా గదులు ఏర్పాటుచేశామన్నాడు. అంతేకాకుండా అబ్బాయిలకు, అమ్మాయిలకు విడివిడిగా ఫ్లోర్లు కూడా ఉన్నాయని చెప్పాడు. స్టార్ హోటల్లో ఉన్న అన్నీ సౌకర్యాలను తాము 24 గంటలూ అందుబాటులో ఉంచుతున్నామన్నాడు. తమ గదుల అద్దెలు నెలకు ఒకరికి రు. 20 వేల నుండి రు. 35 వేల వరకు ఉంటుందన్నాడు.
కో లివింగ్ అంటే నాశనమే
ఇదే విషయమై లైఫ్ కోచ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ మాట్లాడుతు ‘కో లివింగ్ కల్చర్ వల్ల సమాజం ఇబ్బంది పడుతోంద’న్నారు. ‘వివాహం కాకుండానే అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే గదిలో కలిసుండటం వల్ల సమాజానికి జరుగుతున్న నష్టాన్ని యువత అంచనా వేయటంలేద’న్నారు. ‘పెళ్ళిళ్ళు, పిల్లల విషయంలో అమ్మాయిల్లో మారుతున్న ఆలోచనలకు కో లివింగ్ తాజా ఉదాహరణ’గా చెప్పారు. ‘వివాహం కాలేదనే తప్ప మిగిలిన అన్నీ విషయాలు జరిగిపోతున్నపుడు ఇక వివాహం గురించి అమ్మాయిలు, అబ్బాయిలు ఎందుకు ఆలోచిస్తా’రని రజని మండిపడ్డారు. ‘వయసులో ఉన్నపుడు ఇవేమీ ఆలోచించకుండా తర్వాత ఎక్కడో ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరితే సరిపోతుందన్న ఆలోచనచేసే యువత ముఖ్యంగా అమ్మాయిల సంఖ్య పెరిగిపోతోంద’న్నారు. ఏదేమైనా కో లివింగ్ కల్చర్ అనే సంస్కృతి సమాజానికి దీర్ఘకాలంలో నష్టంచేయటం ఖాయమని రజనీ వాపోయారు.