ఆ ప్రశ్న రేవంత్‌నే అడగాలి: కిషన్ రెడ్డి

పెద్దన్న అన్నంత మాత్రాన బీజేపీ, కాంగ్రెస్ కలిసి పోయినట్లు ఎలా అవుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Update: 2024-03-05 14:16 GMT
కిషన్ రెడ్డి


‘ప్రధాని మోడీ మా పెద్దన్న లాంటి వారు’ అన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేసేశాయి. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై పోయాయనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. దానికి తోడు కేసీఆర్ పాపాల చిట్టా బయటపెట్టాలని, నువ్వు కేసీఆర్‌లా మారకు అని సీఎం రేవంత్‌కు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పలికిన హితవు చిరు మంటకు గాలి తగిలి కార్చిచ్చులా మారిన తరహాలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయన్న వాదనలకు మరింత బలం చేకూర్చాయి. రేవంత్ రెడ్డి గతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని ఆ అభిమానంతోనే మోడీని పెద్దన్న అని అన్నారే తప్ప ఆయన వ్యాఖ్యలకు రాజకీయాలకు సంబంధం లేదని కొందరు అంటే మరికొందరు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పెద్దలాంటిదన్న ఉద్దేశంతోనే రేవంత్ అలా అన్నారని అభిప్రాయపడుతున్నారు. ఈ వాదనలు, వార్తలపై తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పెద్దన్న అన్నంత మాత్రాన రెండు పార్టీలు ఒక్కటై పోయినట్లేనా అని మండిపడ్డారు.

ఎందుకన్నారో రేవంత్‌నే అడగండి: కిషన్ రెడ్డి

తెలంగాణ ఆదిలాబాద్‌లో ప్రధాని మోడీ చేపట్టిన పర్యటనలు విజయవంతంగా ముగిశాయని తెలంగాణ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికల ఎల్‌ఈడీ ప్రచార రథాలను ప్రారంభించిన అనంతరం మోడీని రేవంత్ రెడ్డి.. పెద్దన్న అనడంపై వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించారు. అసలు మోడీని పెద్దన్న అని రేవంత్ ఎందుకు అన్నారో వెళ్లి ఆయననే అడగమన్నారు. పెద్దన్న అన్నంత మాత్రాన రెండు పార్టీలు ఒక్కటైనట్లు ఎలా అవుతుందని ఎదురు ప్రశ్న వేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్నది కేవలం అధికార వ్యత్యాసమే కాదని, సిద్ధాంతాల వ్యత్యాసం కూడా ఉందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ అనేవి ఎప్పటికీ కలిసేవి కాదని వెల్లడించారు.

హామీలన్నీ కాగితాలకే పరిమితం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు వాళ్ల భవిష్యత్తును కాంగ్రెస్ ఆకాశంలో చూపిందని, తీరా ఓట్లు వేసి గెలిపిస్తే వారికి మొండిచేయి చూపిందని దుయ్యబట్టారు. ‘‘ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వాటి అమలు విషయంలో కాంగ్రెస్‌ పార్టీనే అయోమయంలో ఉంది. ప్రజలను మభ్యపెట్టడానికి చెప్పిన ఆరు గ్యారెంటీలు కాగితాలకే పరిమితం అయ్యాయి. ఆరు హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారు, రూ.2 లక్షల రుణమాఫీ, రూ.4వేల పింఛను ఎప్పటిలోపు ప్రజలకు అందిస్తారో కాంగ్రెస్ ప్రకటించాలి’’అని డిమాండ్ చేశారు.

రేపటి నుంచి సలహాల స్వీకరణ

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వాటిపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అధిక శాతం ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని కమలం పార్టీ కసరత్తులూ ప్రారంభించింది. ఇందులో భాగంగానే బీజేపీ మేనిఫెస్టో కోసం ఎవరైనా సలహాలు ఇవ్వొచ్చని, వాటిని మార్చి-6 నుంచి స్వీకరిస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగానే పార్టీ కార్యకర్తలు, ప్రజలతో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు.


Tags:    

Similar News