అజహరుద్దీన్ను తెలివిగా తప్పించారా ?
ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్ర వేయటం లాంఛనమే;
క్షేత్రస్ధాయిలో జరిగింది చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే ప్రముఖ క్రికెటర్(Cricketer), కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ అజహరుద్దీన్(Mohammed Azharuddin) ను గవర్నర్ కోటాలో ఎంఎల్సీగా ఎనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించింది. అజహరుద్దీన్ తో పాటు ప్రొఫెసర్ కోదండరామ్(Prof Kodanda Ram) ను కూడా ప్రభుత్వం ప్రతిపాందించింది. ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్ర వేయటం లాంఛనమే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకే దెబ్బకు రెండుపిట్టలు అన్న పద్దతిలో కాంగ్రెస్ అధిష్ఠానం, రేవంత్ (Revanth) వ్యవహరించినట్లుంది. ఎలాగంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లిహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలో అజహరుద్దీన్ ఓడిపోయారు. అజహరుద్దీన్ లో కొన్నిమైనస్ పాయింట్లున్నాయి.
అవేమిటంటే తన మాట్లాడితే ఎదుటివాళ్ళకు తొందరగా అర్ధంకాదు. పైగా నియోజకవర్గంలో అతనిపై చాలా వ్యతిరేకత ఉందని అధిష్ఠానంకు తెలిసింది. పార్టీ నేతలు, క్యాడర్ తోనే కాదు జనాలతో కూడా అజహరుద్దీన్ కు పెద్దగా సంబంధాలు లేవని పార్టీలో టాక్. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న అధిష్ఠానం తొందరలో జరగబోయే ఉపఎన్నికలో మళ్ళీ అజారుద్ధీన్ కే టికెట్ ఇస్తే గెలుపు కష్టమని భావించింది. అయితే అజహరుద్దీన్ ను ఉపఎన్నికల రేసులో నుండి తప్పించటం అంత సులభంకాదు. ఎందుకంటే మాజీ క్రికెటర్ హోదాలో మైనారిటిల్లో అజహరుద్ధీన్ ప్రముఖుడు.
అందుకనే బాగా ఆలోచించిన అధిష్ఠానం గవర్నర్ కోటాలో భర్తీ చేయబోయే ఎంఎల్సీల కోటాలో అజహరుద్దీన్ను నామినేట్ చేస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని డిసైడ్ అయినట్లుంది. అజహరుద్దీన్ ను ఎంఎల్సీని చేస్తే ఉపఎన్నికల రేసులో నుండి తప్పించచ్చు. రెండోది ముస్లింల్లో వ్యతిరేకత రాకుండా చూసుకోవటం. అలాగే ఎంఎల్సీ అవటం అంటే అజహరుద్దీన్ కు డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఉపఎన్నికల్లో అజహరుద్ధీన్ తో ప్రచారం చేయించుకోవచ్చు. నియోజకవర్గంలో సుమారు 1.20 లక్షల ముస్లింల ఓట్లున్నాయి. ఉపఎన్నికల రేసులో నుండి తప్పించినా అజహరుద్దీన్ కు ఎంఎల్సీ పదవి దక్కింది కాబట్టి నియోజకవర్గంలో ముస్లింలు కూడా అభ్యంతరం చేప్పే అవకాశంలేదు.
పార్టీవర్గాల సమాచారం ప్రకారం ఏఐఎంఐఎంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న నవీన్ యాదవ్ కు ఉపఎన్నికలో టికెట్ దక్కే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో ఎంఐఎం తరపున పోటీచేసిన యాదవ్ 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. యాదవ్ కు ఎంఐఎం అగ్రనేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీతో తో పాటు చాలామంది నేతలతో మంచి సంబంధాలున్నాయని సమాచారం. ఇపుడు ఎలాగూ కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మిత్రపక్షంగా ఉంది. అందుకనే నవీన్ కు కాంగ్రెస్ టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. నవీన్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలంటే ముందు అజారుద్దీన్ ను పోటీనుండి తప్పించాలి. ఇద్దరూ పోటీలో ఉంటే ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో రేవంత్ తో పాటు ఎంఐఎం సోదరులకు కూడా ఇబ్బందే.
ఎందుకంటే అజహరుద్దీన్ ఇటు రేవంత్ తో పాటు అటు ఓవైసీ సోదరులకు కూడా అత్యంత సన్నిహితుడన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి తెలివిగా ప్లాన్ చేసి రేసులో నుండి అజారుద్దీన్ ను పోటీలో నుండి తప్పించటంలో భాగంగానే ఎంఎల్సీగా ప్రతిపాదించినట్లు పార్టీవర్గాల సమాచారం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. లెక్కల్లో ఉన్నట్లు రాజకీయాల్లో 1+1= ఎప్పుడూ 2 కాదు. 1+1= సున్నా అవ్వచ్చు లేదా 3, 4 కూడా కావచ్చు. అధిష్ఠానం దగ్గర ఎవరికి గట్టి పట్టుంటుందో ? ఎవరికి టికెట్ దక్కుతుందో చివరినిముషం వరకు ఎవరూ చెప్పలేరు. గతంలో అభ్యర్ధిగా ప్రకటించి, బీఫారమ్ ఇచ్చిన తర్వాత కూడా చివరి నిముషంలో అభ్యర్ధులను అధిష్ఠానం మార్చేసిన ఘటనలున్నాయి. కాబట్టి స్ధానికంగా ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నా చివరకు టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాల్సిందే.