Congress| టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రాజుకున్న అసంతృప్తి,సీఎం భేటీలు
టీ కాంగ్రెస్ శాసనసభ్యుల్లో రాజుకున్న అసంతృప్తిని చల్లార్చేందుకు సీఎంతో పాటు కాంగ్రెస్ కీలక నేతలు సమాయత్తం అయ్యారు. ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు.;
By : The Federal
Update: 2025-02-05 09:57 GMT
తెలంగాణలోని పదిమంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు హోటల్ లో రహస్యంగా సమావేశమై ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే నివేదికను సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దహనం చేసి బహిరంగ నిరసన తెలిపారు.మరో వైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకరు నోటీసులు జారీ చేయడంతో వారంతా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో భేటీ అయి, వారు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ వరుస ఘటనలతో సీఎం రేవంత్ రెడ్డితోపాటు టీ కాంగ్రెస్ కీలక నేతలు మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షీలు అప్రమత్తమయ్యారు.
టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు ఇటీవల ఓ హోటల్ లో రహస్యంగా సమావేశమై మత్రుల తీరు, సర్కారు పథకాల అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇస్తూ అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలమైన తమను మంత్రులు పట్టించుకోవడం లేదని ఎమ్యెల్యేల రహస్య భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. జగిత్యాల, రాజేంద్రనగర్ తోపాటు పలు నియోజకవర్గాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ నేతలకు మధ్య రాజుకున్న విబేధాలు టీ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి.
కులగణన నివేదిక దహనం చేసిన తీన్మార్ మల్లన్న
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే నివేదికను సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దహనం చేసి బహిరంగ నిరసన తెలిపారు.శాసనసభ లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బీసీ కులగణన, ఎస్సీల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండగా, ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కులగణన నివేదికను దహనం చేయడం సంచలనం రేపింది. దీంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యలకు ఉప క్రమించే పరిస్థితి నెలకొంది.రేపో మాపో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.ఇటీవల మల్లన్న బీసీ కులగణన పైన పలు అంశాలపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడిన విషయం తెలిసిందే.దీనిపైపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు నాయకులు, కార్యకర్తలు నుంచి ఫిర్యాదులు వచ్చాయి.
మల్లన్న పార్టీ లైన్ లోనే మాట్లాడాలి : మంత్రి సీతక్క
తీన్మార్ మల్లన్న కోసం తాము చాలా కష్టపడ్డామని, కానీ ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం బాధగా ఉందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ‘‘తీన్మార్ మల్లన్న మా పార్టీనా కాదా అనేది డిసైడ్ చేసుకోవాలి..పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్‌లోనే మాట్లాడాలి’’అని మంత్రి సీతక్క చెప్పారు.
మల్లన్న పార్టీ నుంచి వెళ్లవచ్చు : నాయిని
కుల గణన సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమ పథకాల రూపకల్పన కోసం ఉపయోగిస్తామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చెప్పారు. ‘‘ఇష్టం లేకుంటే తీన్మార్ మల్లన్న పార్టీ నుండి వెళ్లిపోవచ్చు’’అని నాయిని స్పష్టం చేశారు.‘‘తీన్మార్ మల్లన్నకు ఆయన కులం గురించి మాట్లాడే హక్కు ఉంది. ఇతర కులాలను తిట్టే హక్కు మాత్రం లేదు. ఆయనకు ఇష్టం లేకుంటే పార్టీ నుంచి బయటికెళ్లి మాట్లాడుకోవచ్చు. ఎన్నికల సమయంలో మేం రెడ్లు అని గుర్తు లేదా?’’అని నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు
టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రాజుకున్న అసంతృప్తిని చల్లార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లు ముఖాముఖీ లో పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటలకు వరకు ఎమ్మెల్యే లతో ముఖాముఖీ కార్యక్రమం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
అసంతృప్తిని చల్లార్చేందుకే ఈ భేటీలు
అసంతృప్తిని చల్లార్చేందుకు ఏర్పాటు చేసిన సమావేశం విషయాన్ని దాచిపెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, తదితర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని టీపీసీసీ విజ్ఞప్తి చేసింది.గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4గంటల వరకు అదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. 4:15 నుంచి 5:15 వరకు కరీంనగర్, వరంగల్ ఉమ్మడి ఎమ్మెల్యేలతో మీటింగ్ జరుపనున్నారు.5:30 నుంచి 6:30 వరకు నల్గొండ, హైదరాబాద్, మెదక్ జిల్లా ఎమ్మెల్యేలతో 6:45 నుంచి 7:45 వరకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.