బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఎలా..?

పీపీసీలో కీలకంగా చర్చించిన సీఎం రేవంత్, నేతలు.;

Update: 2025-08-23 13:04 GMT

సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పీసీసీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక అంశాలపై నేతలు చర్చించారు. వీటిలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం అత్యంత కీలకంగా ఉంది. అసలు ఈ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలి? అన్నదే కాంగ్రెస్ నేతల ముందు అతిపెద్ద ఛాలెంజ్‌గా మారింది. బిల్లు, ఆర్డినెన్స్, ధర్నా ఇలా అన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం నుంచి బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదు.

దీంతో ఇప్పుడు ఏం చేయాలి? బీసీలకు రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలి? పార్టీ పరంగా ఇస్తే.. అందుకు మిగిలిన పార్టీలను ఎలా ఒప్పించాలి? వంటి పలు అంశాలపై కాంగ్రెస్ నేతలు ఈ భేటీలో చర్చించారు. దీంతో పాటుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపించుకోవాలి? అందుకు అనుసరించాల్సిన వ్యూహాలేంటి? వంటి వాటిపై కూడా చర్చించారు. ఈ సమావేశంలోనే సెప్టెంబర్ 30లోపేఎన్నికల నిర్వహణను పూర్తి చేయాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించింది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కూడా కాంగ్రెస్ నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. ఎలాగైనా గెలిచితీరాలని భావిస్తోంది. అందుకోసం వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తోంది. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ముమ్మరంగా చర్యలు చేపడుతంది. ఇదే సమయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కూడా చర్చకు వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫిరాయింపు నేతలపై ఉన్న ఫిర్యాదులను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరిశీలించారు. ఇప్పటికే ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. మిగిలిన వారికి కూడా రెండు మూడు రోజుల్లో నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ అంశం ఎలా ముందుకు వెళ్లాలి అన్నవిషయాన్ని కూడా పీసీసీ సమావేశంలో చర్చించారు.

Tags:    

Similar News