‘కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి’
కాంగ్రెస్ హామీలపై బీజేపీ మౌనాన్ని ప్రశ్నించిన కేటీఆర్.;
తెలంగాణ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రోజురోజుకు అధికం అవుతోంది. వీటిలో గెలిచి ఎలాగైనా తమ సత్తా చాటుకోవాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లో భావిస్తున్నాయి. అందుకోసమే ప్రతి పార్టీ కూడా రాజకీయ వ్యూహాలను రచిస్తున్నాయి. ప్రత్యేర్థులను మట్టుబెట్టి ఎన్నికల్లో తమ పార్టీ జెండాను రెపరెపలాడించాలని కసరత్తులు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలకు పిలుపునిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి విషయంలో మోసం చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రజలు కూడా ఇదే అనుకుంటుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజలంతా కూడా సరైన నాయకుడిని ఎన్నుకోవాలని అన్నారు.
హామీలకు లొంగొద్దు..
‘‘ఎన్నికల ముందు వరకు లేనిపోని కబుర్లు చెప్పి, అమలుకు అలివికాని హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. అధికార పీఠం చేజిక్కిన తర్వాత అన్నీ మర్చిపోయింది. ప్రజలంతా కూడా కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగమయ్యారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలు నెరవేరుస్తామన్న కాంగ్రెస్.. ఇప్పటి వరకు వాటి ఊసెత్తడం లేదు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. కేసీఆర్ విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి నియామకపత్రాలు ఇచ్చి నిరుద్యోగులను మభ్యపెట్టింది. అంతకుమించి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. విద్యార్థులకు అందాల్సిన ఫీజు రియంబర్స్‌మెంట్‌లను కూడా విడుదల చేయడం లేదు. వృద్ధులకు పెంచి ఇస్తానన్న పెన్షన్‌ను అటకెక్కించేశారు. గురుకుల విద్యార్థులకు ఆహారం కూడా పెట్టలేకున్నారు. ఇలా హామీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందనిపిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పండి’’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.