'గాడిద గుడ్డు' ఇంకొక అడుగు ముందుకి

కాంగ్రెస్ 'గాడిద గుడ్డు' ప్రచారాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్లింది.

Update: 2024-07-24 11:22 GMT

కాంగ్రెస్ 'గాడిద గుడ్డు' ప్రచారాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్లింది. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు వినూత్న ప్రచారం ప్రారంభించాయి. బీజేపీ తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ ర్యాలీలు, బహిరంగ సభలు, సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేశాయి. తాజాగా యూనియన్ బడ్జెట్ లో కేంద్రం తెలంగాణకి కేటాయింపులు ప్రకటించకపోవటంపై రాష్ట్రంలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ మరోసారి గాడిద గుడ్డు స్లోగన్ అందుకుంది.

బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ విమర్శిస్తున్నారు. బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లిస్తే.. కేంద్ర బడ్జెట్‌లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు అంటూ నిలదీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని.. రూపాయి పంపిస్తే... 43 పైసల బిచ్చం నుండి విముక్తి, మేడారం సమ్మక్క - సారలము జాతరకు జాతీయ హోదా, కనీసం ఒక్క IIM, NID విద్యాలయం, కనీసం ఒక్క IIIT & మెడికల్ కాలేజీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా, బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా, 811 టీఎంసీలలో కృష్ణా జలాలలో సరైన వాటా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్ అభివృద్ధికి నిధులు అడిగితే ఇచ్చింది గాడిదగుడ్డు అంటూ కాంగ్రెస్ శ్రేణులు ధ్వజమెత్తుతున్నాయి.

అంతేకాదు, ఈ ప్రచారాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్తూ.. బస్ట్ స్టాపుల్లో పోస్టర్లు, హోర్డింగులు పెడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణకు పదేండ్లుగా అధికారంలో వున్న మోడీ సర్కార్.. చేసింది ఏమి లేదని, గాడిద గుడ్డని ప్రచారం చేసిన కాంగ్రెస్... మళ్లీ నిన్న పార్లమెంట్ బడ్జెట్ లో తెలంగాణకు మోడీ సర్కార్ ఏమీ ఇవ్వలేదని ఫైర్ అవుతున్నారు. బీజేపీకి తెలంగాణ 8 సీట్లిస్తే.. కేంద్ర బడ్జెట్ లో బీజేపీకి తెలంగాణ ఏమిచ్చింది? గాడిద గుడ్డు అంటూ హోర్డింగులు ఏర్పాటు చేశారు.  

కాగా, ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలోనూ బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం చర్చ పెట్టింది. ఈ చర్చకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. అయితే చర్చల్లో భాగంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ ల మధ్య వాడివేడి వాదనలు నడిచాయి. కేసీఆర్, మోదీ మధ్య చీకటి ఒప్పందాలున్నాయని సీఎం రేవంత్ ఆరోపించగా.. కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. "కేంద్రంలో బీజేపీ వాళ్ల నీతిమాలిన వ్యవహారాన్ని మేము ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటాం అన్నారు. తెలంగాణకు అన్యాయం జరగటంపై మోడీతో కేసీఆర్ సఖ్యతతో లేకపోవటం కారణంగానే జరిగిందని సీఎం అన్నారు. మేము సఖ్యతతో ఉంటామని అంటూ హైదరాబాద్‌లో ప్రధాని మోడీని బడే భాయ్ అని రేవంత్ రెడ్డి సంబోధించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపించే సవతి తల్లి ప్రేమ… మీ దాకా వస్తే గాని తత్వం బోధపడలేదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేదు. మా పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. మా పార్టీకి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధి, మా జెండా ఎజెండా తెలంగాణమే.తెలంగాణకు నిధులు వచ్చేదాకా.. మొత్తం మంత్రివర్గం అంతా ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోండి. మేము అండగా ఉంటాం.. కేంద్రంతో కొట్లాడుదాం" అని కేటీఆర్ సూచించారు.

Tags:    

Similar News