Revanth Reddy | ‘మోదీతో యుద్ధానికైనా సిద్ధం’

పైసలు ఉంటే ఎన్నికల్లో విజయం రాదు. ప్రజాబలంతోనే ఎన్నికల్లో గెలవగలమని సీఎం రేవంత్ పేర్కొన్నారు.;

Update: 2025-02-14 11:27 GMT

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్‌పై ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ నేతలు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ యువ నేతలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ‘‘హనుమంత రావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్‌లో పని చేశారు. పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క కూడా యూత్ కాంగ్రెస్ నుండి వచ్చారు. రాజకీయాలకు యూత్ కాంగ్రెస్ మొదటి మెట్టు’’ అని పేర్కొన్నారు రేవంత్.

‘‘37 కార్పొరేషన్లను ఛైర్మన్లు, అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించాం. ప్రతి పేదవాడు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షలు ఇస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్‌దే. వచ్చే స్థానిక ఎన్నికల్లో యువత ఎక్కువగా పాల్గొనాలి. ఎన్నికల్లో పైసలు ఉంటే గెలవరి.. ప్రజాబలం ఉంటే విజయం వరిస్తుంది. పార్టీ కోసం కష్టపడకుండా నేతలు చుట్టూ తిరిగితే పదవులు రావు. రాజకీయాల్లో డబ్బులతోనే విజయం సాధించగలమని అనుకోవద్దు. గల్లీ నుంచి పోరాడితేనే ఢిల్లీ వరకు ఎదిగే అవకాశం వస్తుంది’’ అని అన్నారు. అనంతరం బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.

‘‘కేసీఆర్ గట్టిగా కొడతా అంటుండు. కేసీఆర్ గట్టిగా కొట్టాలంటే నీ కొడుకును కొట్టు. వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. నీ బిడ్డను వీపు పగల కొట్టు. ఢిల్లీలో కేజ్రీవాల్ ను ఓడగొట్టియినందుకు నీ అల్లున్ని బండకేసి కొట్టు. కేసీఆర్‌కు లారీలకొద్ది డబ్బులు ఉన్నాయి. కానీ ఎందుకు ఓడి పోయిండు. ముందు బయటకు వచ్చి సరిగ్గా నిలబడు కేసీఆర్. డబ్బులతో గెలవొచ్చు అనుకుంటే అది పొరపాటు. కిషన్ రెడ్డి బండి సంజయ్ లు బుగ్గకార్లలో తిరగడం కాదు. తెలంగాణ కోసం ఏమి తెచ్చారో వాళ్ళు చెప్పాలి. త్వరలో కేంద్రం పై పోరాటానికి కార్యాచరణ ఉంటది. యూత్ కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలి. ప్రజా సమస్యలపై పోరాడితే నే పదవులు వస్తాయి’’ అని పిలుపునిచ్చారు రేవంత్.

Tags:    

Similar News