‘హమ్మయ్య.. కవితకు ఇప్పటికైనా సోయి వచ్చింది’
10 ఏళ్లలో కార్మికులకు కవిత ఎందుకు అండగా నిలబడలేదు..? ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసి 30 మంది చనిపోతే ఎందుకు ఆ నాడు స్పందించలేదు..? అని ప్రశ్నించారు.;
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సెటైర్లు వేశారు. ఇన్నాళ్లూ తెలంగాణపై ఆమెకు సోయి లేదని, ఎట్టకేలకు ఇప్పుడు సోయి వచ్చిందంటూ చురకలంటించారు. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కవిత వాస్తవాలు మాట్లాడారని బీర్ల ఐలయ్య అన్నారు. ‘‘సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని కవిత వ్యాఖ్యానించారు. రాష్ట్ర తలసరి ఆదాయం కవితకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది. 10 ఏళ్ల లో తన తండ్రి కేసీఆర్ చేసిన తప్పులు, అప్పులు ను కవిత ఏ నాడు ఎత్తి చూపించలేదు. 10 ఏళ్లు రైతు బంధు పైన కవిత మాట్లాడలేదు. నిజమైన రైతులకు రైతు బంధు అందడం లేదని ప్రతిపక్షంగా ఆ నాడు కాంగ్రెస్ మొత్తుకుంది. భూమి లేని వారికి సాయం చేయాలని మేం ఆ నాడు అడిగితే పట్టించుకోలేదు’’ అని అన్నారు.
‘‘మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సాయం అందిస్తోంది. పందికొక్కుల్లా పది ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నారు.. అప్పుడు కవిత కు సోయి రాలేదు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రులు అన్ని మీ సామాజిక వర్గం దగ్గర ఉన్నప్పుడు కవితకు సామాజిక న్యాయం గుర్తుకు రాలేదా..? సామాజిక తెలంగాణ కోసం కులగణన చేస్తుంటే మీ నాన్న, అన్న ఎందుకు సర్వేలో పాల్గొనలేదు..? 10 ఏళ్లలో కార్మికులకు కవిత ఎందుకు అండగా నిలబడలేదు..? ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసి 30 మంది చనిపోతే ఎందుకు కవిత ఆ నాడు స్పందించలేదు..? కల్వకుంట్ల కుటుంబంలో తగాదాలు వచ్చి తన ప్రాధాన్యం తగ్గిపోవడం వల్లనే కవిత ఇప్పుడు మాట్లాడుతోంది.. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ ను కవిత ప్రశ్నిస్తే రాష్ట్రం ఇంకోలా ఉండేది’’ అని అన్నారు.
‘‘ఇప్పటికైనా కవిత కళ్లు తెరిచి మాట్లాడుతున్నందుకు సంతోషం. కేసీఆర్ హయాంలోని తప్పులను ఇంకా బయటపెట్టి కవిత తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కులగణన పైన సోయి లేకుండా మాట్లాడుతున్నాడు.. కాంగ్రెస్ గురించి తన స్థాయి ని తగ్గించుకుని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కులగణన చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించడంతో తెలంగాణ బీజేపీ నేతలకు దిమ్మతిరిగిపోయింది.. రేవంత్ రెడ్డిని ప్రధాని మోదీ హీరో చేశారు.. అందుకే బీజేపీ నేతలు బాధపడుతున్నారు.. కులగణన తో దేశంలోనే రేవంత్ రెడ్డి హీరోలా నిలబడటాన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.. బీసీ బిల్లు ను గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపడం మా తొలి విజయం..’’ అని చెప్పుకొచ్చారు.