తెలంగాణ కాంగ్రెస్ నేత దారుణ హత్య
మంగళవారం ఉదయం ఒక హోటల్లో టిఫెన్ తిని బయటకు రాగానే ప్రత్యర్ధులు ఒక్కసారిగా దాడిచేసి కత్తులతో పొడిచి చంపేశారు.
జగిత్యాల జిల్లా, జాబితాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి హత్యకు గురయ్యారు. గంగారెడ్డి జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంఎల్సీ జీవన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. మంగళవారం ఉదయం ఒక హోటల్లో టిఫెన్ తిని బయటకు రాగానే ప్రత్యర్ధులు ఒక్కసారిగా దాడిచేసి కత్తులతో పొడిచి చంపేశారు. ఊహించని రీతిలో కత్తులతో జరిగిన దాడికి గంగారెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గ్రామంలో హత్యా రాజకీయాలు పెరిగిపోయిన కారణంగానే కాంగ్రెస్ నేత హత్యకు గురైనట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే పోలీసులు, జీవన్ రెడ్డి కూడా ఘటన జరిగిన ఊరికి చేరుకున్నారు.
జరిగిన ఘనటపై జీవన్ రెడ్డి మండిపోతున్నారు. జగిత్యాలలో కాంగ్రెస్ రాజ్యం నడుస్తోందా లేకపోతే బీఆర్ఎస్ రాజ్యం నడుస్తోందా అని రెచ్చిపోయారు. తన ప్రధాన అనుచరుడి హత్యకు నిరసనగా మద్దతుదారులతో ఎంఎల్సీ రోడ్డుపైన బైఠాయించారు. దాంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఎంఎల్సీకి నచ్చచెప్పి జాబితాపూర్ నుండి బయటకు పంపేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటంలేదు. హోటల్లో టిఫిన్ తిని బయటకు వచ్చిన గంగారెడ్డిని వెనుకనుండి ఒక కారు ఢీకొన్నట్లు సాక్ష్యులు చెప్పారు. వెంటనే సంతోష్ అనే వ్యక్తి కత్తితో దాడిచేసినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో బయటపడింది.
పాతకక్షల కారణంగానే గంగారెడ్డి హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గంగారెడ్డి సతీష్ అనే వ్యక్తి నుండి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని జీవన్ రెడ్డి మండిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రత్యర్ధుల చేతిలో హత్య కావటం సంచలనంగా మారింది. తన ప్రత్యర్ధుల నుండి ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నేత ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోకపోవటం అనుమానాలకు దారితీస్తోంది. ఆసుపత్రికి చేరుకున్న జీవన్ రెడ్డి మృతుడి కుటుంబసభ్యలను పరామర్శించారు. కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.