కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడీ మొదలైంది. ఈ ఎన్నికలను కూడా రాష్ట్రంలోని పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.;

Update: 2025-02-07 09:07 GMT

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడీ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తీరులోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అదే విధంగా రాష్ట్రంలో బలం పుంజుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి అవకాశమని బీజేపీ భావిస్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలను కూడా రాష్ట్రంలోని పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వూట్కూరి నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను అభ్యర్థిగా నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం శ్రమించడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాత్రిబంవళ్లు కష్టపడతానని అన్నారు.

‘‘నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోంది.ఎమ్మెల్సీగా గెలిచి నా విజయాన్ని సోనియా గాంధీకి గిఫ్ట్‌గా ఇస్తాను. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గాడిలో పెట్టారు. ఉద్యోగులు ప్రతి నెలా ఒకటవ తేదీన జీతాలు అందుకుంటున్నారు. దాదాపు పదేళ్ల పాటు రాష్ట్రం దారితప్పిన పాలనను చూసింది. ప్రభుత్వ ఉద్యోగులు జీతం కోసం పడిగాపులు కాశారు. నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలా ప్రజలు ఇబ్బంది పెడుతున్న అనేక సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే పరిష్కరించింది’’ అని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్ దూరం

అయితే రాష్ట్రంలో ఫిబ్రవరి 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఎవరికీ మద్దతు ఇవ్వడానికి కూడా బీఆర్ఎస్ నేతలు వెళ్లొద్దని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా అతి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో వీలైనన్ని స్థానాలు గెలవడమే ధ్యేయంగా పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కూడా కేటీఆర్.. దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అందుకే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్ఎస్ ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదని సమాచారం.

Tags:    

Similar News