ఆటో కార్మికులను సీఎం ఆగం పట్టిస్తుండు: హరీష్

అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఒక్క హామీ నెరవేర్చలేదన్న హరీష్ రావు.

Update: 2025-10-27 09:05 GMT

ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అధికారంలోకి రాకముందు వరకు కల్లబొల్లి హామీలు ఇచ్చి, నమ్మించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆటో కార్మికుల వ్యధలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకోవడం కోసం సోమవారం బీఆర్ఎస్ నాయకులంతా ఆటో కార్మికులతో పయనించారు. ఈ క్రమంలోనే హరీష్ రావు, కేటీఆర్ సహా పలువురు కీలక నేతలు ఆటోళ్లో ప్రయాణించారు. ఆటో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారికి ఇచ్చిన హామీల అమలుపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే హరీష్ రావు.. తన నివాసం నుండి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు, అక్కడినుండి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం విమర్వలు గుప్పించారు. ‘‘రాహుల్ గాంధీ ఎన్నికల ముందు మషారత్ అలీ అనే అతని ఆటో ఎక్కి హామీలు ఇస్తే.. ఇప్పుడు ఆ మషారత్ అలీ ఉన్న 2 ఆటోలు అమ్ముకొని కిరాయి ఆటో నడుపుతున్నాడు’’ అని కేటీఆర్ అన్నారు.

రాహుల్‌ జీ జాగ్రత్త..

ఈ సందర్బంగానే కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీకి హరీష్ రావు కీలక హెచ్చరిక చేశారు. మళ్ళీ హైదరాబాద్‌కు వచ్చేటప్పుడు జాగ్రత్త అని అన్నారు. ‘‘రాహుల్ గాంధీ మళ్లీ హైదరాబాద్ వస్తే.. మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్‌లో అడ్డం పెట్టి మా ఆటో కార్మికులు నిన్ను నిలదీస్తారు జాగ్రత్త. ఆనాడు ఓట్ల కోసం ఆటో ఎక్కావు.. ఓట్లు పడి గద్దె ఎక్కగానే రెండు ఏండ్ల నుండి వీళ్లని మర్చిపోయావా రాహుల్ గాంధీ? రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలియాలని.. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు ఎక్కి ఈ నిరసన కార్యక్రమం చేపడుతుంది. వెంటనే ఆటో కార్మికులకు బాకీ పడ్డ రూ.24 వేలు ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు.

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల 161 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.. వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మద్యం టెండర్ల ద్వారా ఈ ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లు వచ్చాయి కదా.. అందులో సగం రూ.1500 కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి ఆదుకోండి. ఆత్మహత్య చేసుకున్న 161 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలి. ఆటో సోదరులు ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకోవద్దు.. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఆటో కార్మికులను కాపాడుకుంటాం’’ అని హరీష్ రావు అన్నారు.

ఆందోళనలో అన్ని వర్గాలు..

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రైతులు, చిరు ఉద్యోగులు, మహిళలు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, చిరు వ్యాపారులు అంతా.. ఆవేదనలో ఉన్నారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. మహిళలకు ఉచిత బస్సు అని పేరుకు మాత్రమే అన్నారు. మహిళలకు ఫ్రీ అంటూ.. పురుషుల దగ్గర నుంచి డబుల్ రేట్లు తీసుకుంటున్నారు. ఆర్టీసీ టికెట్ రేట్లు పెంచి మధ్యతరగతి కుటుంబాలపై ప్రయాణ భారం మోపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రేవంత్ ప్రభుత్వం.. ఐదు సార్లు బస్ ఛార్జీలు పెంచింది’’ అని తెలిపారు.

అరచేతిలో వైకుంఠం తప్ప ఏమీ లేదు..

‘‘ఎన్నికల సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్ గాంధీ.. సినీ నటులను మించి నటన ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆటో డ్రైవర్‌కు రూ.12వేలు ఇస్తామన్నారు. ఆటోనగర్, ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటోనగర్ లేదు.. సంక్షేమ బోర్డు ఊసే లేదు. ప్రమాద బీమా రూ.10లక్షలకు పెంచుతామన్నారు. అదెక్కడికి పోయిందో తెల్వదు. వెంటనే ఆటో కార్మికులకు బాకీ పడిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి. ప్రతి ఆడో డ్రైవర్‌కి రూ.24వేలు ఇవ్వాలి. మొత్తం ఆటో కార్మికులకు రెండేళ్లలో పడ్డ బాకీ చెల్లించినా రూ.1500 కోట్లు అవుతుంది. మద్యం దరఖాస్తులపై ఫీజును రూ.3 లక్షలకు పెంచితే వచ్చిన రూ.3000 కోట్లు లాభాలు వచ్చాయి. అందులో నుంచి రూ.1500 కోట్లు ఆటో కార్మికులకు ఇవ్వాలి’’ అని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News