యూరియా కొరత పరిష్కారానికి సర్కార్ చర్యలు

రంగంలోకి దిగిన ప్రభుత్వం. అన్ని మార్గాలు పరిశీలిస్తున్న మంత్రులు, అధికారులు.;

Update: 2025-08-23 09:37 GMT

తెలంగాణ రైతాంగాన్ని కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది యూరియా కొరత. పంటకు కావాల్సిన మొత్తంలో యూరియా లభించక రైతులు నానా అవస్థలు పడుతున్నాయి. ఒకపక్క యూరియా దొరక్క తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు రాష్ట్రానికి ఇవ్వాల్సిన యూరియా కోటాలో కేంద్రం కోతలు పెడుతోంది. నిరసనలు, ఆందోళనలు చేస్తే తాజాగా 50వేల టన్నుల యూరియా అందించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరతను అధిగమించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని మార్గాలను పరిశీలిస్తోంది. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అధికారులతో మంత్రులు ఎప్పటికప్పుడు భేటీలు అవుతున్నారు. రైతుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారాలపై కూడా వారు చర్చలు చేస్తున్నారు.

ఏ మార్గాన్ని వదిలిపెట్టం..

‘‘యూరియా కొరతను పరిష్కరించడానికి అన్ని మార్గాలు చూస్తున్నాం. ఏ ఒక్క మార్గాన్ని విడిచిపెట్టకుండా అన్ని మార్గాలు పరిశీలించి రైతుల కష్టాలు తీరుస్తాం’’ అని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇందులో భాగంగానే కొన్ని జిల్లాల్లో లారీ అసోసియేషన్స్‌ మధ్య ఏర్పడిన పోటీతో యూరియా రవాణా నిలిచిపోయిందని, ముందుగా ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని తుమ్మల వివరించారు. ఇందులో భాగంగానే ఈ సరఫరా సమస్యను పరిష్కరించడానికి ఆయన స్వయంగా చర్చలు చేపడుతున్నారు. అదే విధంగా రామగుండం యూరియా ఫ్యాక్టరీతో కూడా నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు మంత్రి. సదరు ఫ్యాక్టరీ ఎండీతో తుమ్మల నాగేశ్వరరావు.. శనివారం చర్చలు జరిపారు. అయితే సాంకేతిక లోపాల కారణంగా కొంతకాలంగా ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. దానిని పరిష్కరిస్తే తెలంగాణలో యూరియా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

పార్టీల మధ్య ఆగని మాటల యుద్ధం..

అయితే యూరియా కొరత అంశంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వాదనలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంలో ఫుల్ బిజీగా ఉన్నారు. కేంద్రం ఏమాత్రం కోత పెట్టడం లేదని, కోటా ప్రకారం యూరియాను అందిస్తుందని బీజేపీ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే యూరియాను గోడౌన్‌లలో దాచి రైతులకు అందించడం లేదని కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలో యూరియా కొరత రాలేదని, కాంగ్రెస్ పార్టీనే సృష్టించిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఏనాడూ యూరియా కోసం రైతులు పడిగాపులు కాయలేదని, కానీ ఇప్పుడు రాత్రిళ్లు సైతం యూరియా సరఫరా కేంద్రాల దగ్గర పడుకునే పరిస్థితులు వచ్చాయని మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆరోపించారు. అయితే తాము ఎప్పటికప్పుడు యూరియాకు సంబంధించిన లెక్కలకు కేంద్రానికి అందిస్తున్నామని, యూరియాను దాచుకుని తాము మాత్రం ఏం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు, మంత్రి తుమ్మల ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ అంశంపై రాజకీయ పార్టీల మధ్య మాటయుద్ధం జరుగుతుంది తప్ప తమ సమస్యను పరిష్కరించే ఆలోచన కనిపించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News