‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం’
మహిళలను మహరాణులగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
మహిళా సాధికారత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క పేర్కొన్నారు. తెలంగాణ మహిళలు మహరాణులుగా ఉండాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని, దాని కోసమే అణుక్షణం తాపత్రయపడుతోందని చెప్పుకొచ్చారు. యూసఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించారు. అందులో మహిళా సాధికారతో కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, కార్యక్రమాలను వారు వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసి తీరతామని భట్టి పునరుద్ఘాటించారు.
బస్సులకు యజమానులు..: భట్టి
‘‘ఇప్పటికే 150 ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశాం. అతి త్వరలో మరో 450 బస్సులకు యజమానులను చేయబోతున్నాం. మహిళలు ఇక వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. గ్రేటర్ పరిధిలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. దానిని విజయవంతంగా కొనసాగిస్తున్నాం. ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
మగవారిపై ఆధారపడాల్సిన అవరం లేదు..: సీతక్క
‘‘గతంలో డబ్బులు కావాలంటే మహిళలు మగవారిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. మహిళలు ఆర్థికంగా బలపడాలన్న ఉద్దేశంతోనే మా ప్రభుత్వం అనేక ప్రత్యేక పథకాలను తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఎంతో మేలు జరగడం ప్రారంభమైంది. మహిళలకు కుట్టుమిషన్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లు ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించాం. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే.. బీఆర్ఎస్ దానిని అవహేళన చేస్తోంది’’ అని మంత్రి సీతక్క అన్నారు.