భార్య కాపురానికి రాలేదని కానిస్టేబుల్ ఆత్మహత్య

కామారెడ్డి జిల్లాలో దారుణం

Update: 2025-10-27 13:45 GMT

కామారెడ్డి జిల్లాలో ఓ కానిస్టేబుల్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య కాపురానికి రాలేదని ఎఆర్ కానిస్టేబుల్ మనస్థాపం చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో సంచలనమైంది. కామారెడ్డి శివారు గర్గుల్ గ్రామంలో జీవన్ రెడ్డి(37) అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా కార్యాలయంలో విధులు నిర్వహించే జీవన్ రెడ్డి కొన్నేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి మోక్ష, కృతిక అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

భార్యతో గొడవలు..

గత మూడేళ్లుగా భార్య చందనతో జీవన్ రెడ్డికి గొడవలు జరుగుతున్నాయి. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు విడాకుల నోటీసులు పంపింది భార్య చందన. నోటీసులు అందుకున్న జీవన్ రెడ్డి విధులు నిర్వహించడానికి కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయానికి ఇంట్లో నుంచి బయలు దేరాడు. గర్గుల్ శివారు అడ్లూరు గోదాం వద్ద రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమం వెనక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటు వైపుగా వెళుతున్న గొర్రెల కాపరి సగం కాలిన మృత దేహాన్ని చూసి పోలీసులు సమాచారమిచ్చాడు. సమాచారం అందుకున్న కామారెడ్డి డివిజన్ ఎఎస్పీ చైతన్య రెడ్డి, రూరల్ సిఐ రామన్ ఘటనాస్థలికి చేరుకున్నారు. కొద్ది సేపటి తర్వాత జిల్లా ఎస్ పి రాజేశ్ చంద్ర చేరుకున్నారు. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ తగాదాల వల్ల జీవన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News