మహేష్ బాబుకు వినియోగదారుల కోర్టు నోటీసులు
సినీ హీరో బ్రోచర్ చూసి మోసపోయామన్న బాధితులు;
సినీ హీరో మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగ దారుల కోర్టు నోటీసులు జారి చేసింది. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
ఓ మహిళా డాక్టర్ మరో వ్యక్తి కలిసి రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తా మాటలు నమ్మి బాలాపూర్ లో ఒక ప్లాటును కొనుగోలు చేశారు. ఆ సంస్థకు రూ.34.80 లక్షలు చెల్లించారు. అన్ని అనుమతులు ఉన్నాయని ఆ సంస్థ నమ్మించడంతో ప్లాటును కొనుగోలు చేశారు. మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్‌ని చూసి ఆకర్షితులై వీరు ప్లాటు కొనుగోలుకు డబ్బు చెల్లించారు. రియల్ ఎస్టేట్ సంస్థకు ఎలాంటి అనుమతులు లేవని తెలుసుకున్న బాధితులు లబోదిబమన్నారు.
తమ డబ్బు వాపసు ఇవ్వాల్సిందిగా కోరగా, రెండో ప్రతివాది అయిన రియల్ ఎస్టేట్ సంస్థ సతాయిస్తూ కేవలం రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చింది. అది కూడా వాయిదాల పద్దతిలో. మిగిలిన డబ్బు వాపసు ఇవ్వడానికి రెండో ప్రతివాది అయిన రియల్ ఎస్టేట్ సంస్థ తీవ్ర కాలయాపన చేసింది. బాధితులు మిగతా డబ్బును తిరిగి ఇప్పించాలని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. రెండో ప్రతివాదిగా రియల్ ఎస్టేట్ సంస్థను చేర్చగా మూడో ప్రతివాదిగా సినీ హీరో మహేశ్ బాబును చేర్చారు. దీంతో వినియోగదారుల కోర్టు మూడో ప్రతివాది అయిన మహేశ్ బాబుకు నోటీసులు జారి చేసింది.